విశాఖవాసులు.. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసతున్న భోగాపురం ఎయిర్ పోర్టు కొత్త ఏడాది మొదటి అర్థభాగంలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే.. కొత్త ఏడాది నాలుగో తేదీ.. భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేక రోజు. ఆ రోజున ఇక్కడ తొలి విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ ఫ్లైట్ లో రానున్నారు.
దీనికి సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా భోగాపురం ఎయిర్ పోర్టు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు.. ఈ చారిత్రక ఘట్టంతో వారి కలల సాధనకు సంబంధించి కీలక అడుగు పడినట్లుగా చెప్పాలి. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది జూన్ లోపు ఇక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్న వేళ.. జనవరి నాలుగున ల్యాండ్ అయ్యే మొదటి విమానం అందుకు మొదటి అడుగుగా చెప్పాలి.
భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇదో కీలక ఘట్టంగా చెప్పాలి. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు పనులు శరవేగగా సాగుతున్నాయి. రన్ వే టెర్మినల్ భవనాలు.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏపీ విభజన జరిగిన తర్వాత విశాఖపట్నం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు అవసరమని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాజెక్టును తెర మీదకు తీసుకొచ్చింది.
దీనికి సంబందించిన తొలి అధికార ప్రకటన 2015 ఫిబ్రవరిలో రాగా.. జూన్ 2015లో ఎయిర్ పోర్టస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించిన సాంకేతిక అనుమతి ఇచ్చింది. 2019ఫిబ్రవరి 14న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే.. భూసేకరణ.. న్యాయపరమైన చిక్కులతో పనులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో భూసేకరణ సమస్యలను పరిష్కరించి.. ఎయిర్ పోర్టును 2200 ఎకరాలకు కుదించిన జగన్ సర్కారు 2023 మే3న ఈ ఎయిర్ పోర్టుకు మరోసారి శంకుస్థాపన చేశారు.
నిజానికి ఈ కార్యక్రమం తర్వాతే ఎయిర్ పోర్టు పనులు వేగవంతమయ్యాయి. 2023 నవంబరు ఒకటిన భూమిపూజ జరిగింది. 2025 చివరి నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యానికి దగ్గరగా వాస్తవ పరిస్థితి నెలకొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాది జూన్ లో విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించటం ద్వారా.. కార్యకలాపాలు మొదలవుతాయని భావిస్తున్నారు.
ఆసక్తికర అంశం ఏమంటే.. ఈ ఎయిర్ పోర్టు ప్రతిపాదన చేసిన సమయంలోనూ.. చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు.. తాజాగా ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించే సమయానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఏపీ వ్యక్తి.. అందునా ఉత్తరాంధ్రకు చెందిన వారే ఉండటం. నిజంగానే ఇదో అరుదైన సంగతిగా చెప్పక తప్పదు.