పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా తన రాజకీయ ప్రత్యర్థులను కూడా ఎంతో గౌరవిస్తూ మాట్లాడతారు. రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాలనే ఆయన భావిస్తారు. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన మాట అదుపు తప్పుతుంటుంది. తన ప్రత్యర్థుల్లా.. ఆయన అవతలి వాళ్ల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లరు. హుందాగా మాట్లాడతారు, ప్రవర్తిస్తారు.
ఐతే కొందరు ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల ఆయన అనవసరంగా చెడ్డ పేరును మోయాల్సి వస్తుండడం ఆయన నిజమైన అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. పవన్ వీరాభిమానులుగా చెప్పుకునే కొందరు అప్పుడప్పుడూ హద్దులు దాటి ప్రవర్తిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సినీ అభిమానుల్లోనే ఇలాంటి అతి ఎక్కువగా కనిపిస్తోంది.
పవన్ సినిమా ‘జల్సా’ మరోసారి రీ రిలీజ్ అయింది. ఈ సందర్బంగా థియేటర్లలో సంబరాలు కొంచెం గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు అభిమానులు. కానీ థియేటర్లలో ఆ సినిమాను సెలబ్రేట్ చేయడం వరకు పరిమితం కాకుండా.. కొందరు ఫ్యాన్స్ వైఎస్ జగన్, అల్లు అర్జున్‌ల మాస్కులు ధరించి పిచ్చి చేష్టలు చేయడం, చిల్లరగా ప్రవర్తించడం చర్చనీయాంశం అవుతోంది.
సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మెజారిటీ పవన్ అభిమానులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇదేం పైశాచిక ఆనందం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది జగన్, బన్నీ అభిమానులకు ఎంత ఆగ్రహం తెప్పిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇలాంటి చర్యలతో పవన్‌కు సంబంధం లేకపోయినా సరే.. వీటి వల్ల ఆయన చెడ్డపేరు మోయాల్సి వస్తోందనే నిజమైన పవన్ ఫ్యాన్స్ బాధ పడుతున్నారు. వైసీపీ వాళ్లు ఇలాంటివి చేయడం వల్లే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకున్నారని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా హద్దులు దాటి ప్రవర్తిస్తే జనాల్లో అనవసరంగా వ్యతిరేకత వస్తుందని.. పవన్ అభిమాన సంఘాల వాళ్లు, జనసేన పార్టీ పెద్దలు ఇలాంటి చర్యలను నియంత్రించేందుకు చొరవ తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.