ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు త్వరలోనే పదోన్నతి దక్కబోతుందనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా మంత్రిగా తనదైన శైలిలో పాలన సాగిస్తూ, పెట్టుబడుల ఆకర్షణలో బిజీగా ఉన్న లోకేష్, త్వరలోనే ఉన్నత స్థాయి పదవిని చేపట్టబోతున్నారట. అయితే, ఈ విషయాన్ని చెప్పింది రాజకీయ విశ్లేషకులు కాదు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.
సెలబ్రిటీల జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణు స్వామి, గతంలో రాజకీయ జోస్యాల విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాలపై ఆయన చెప్పిన అంచనాలు తప్పడంతో, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని గతంలో ప్రకటించారు. అయితే, తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మళ్ళీ నోరు విప్పిన ఆయన, నారా లోకేష్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026లో లోకేష్ జాతకంలో బలమైన పదోన్నతి కనిపిస్తోందని, ఆయన ఉన్న స్థాయి నుంచి మరో మెట్టు ఎక్కడం ఖాయమని తేల్చి చెప్పారు.
2026లో నారా లోకేష్ ప్రమోషన్ పొందుతారని.. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ``ఏపీలో మరో డిప్యూటీ సీఎం ఉంటే తప్పేముంది. 2026లో లోకేష్‌కు అప్‌గ్రేడ్ కనిపిస్తోంది. ఆయన ఉన్నస్థాయి నుంచి మరో మెట్టు ఎక్కుతారు`` అంటూ ఇంటర్వ్యూలో వేణు స్వామి వ్యాఖ్యానించారు.
కేవలం లోకేష్ గురించే కాకుండా, ఇతర కీలక నాయకుల జాతకాలపై కూడా వేణు స్వామి స్పందించారు. 2026లో పవన్ కళ్యాణ్ జాతకం కూడా చాలా బాగుందని, కూటమి పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. అయితే 2027లో రాజకీయంగా మరికొన్ని సంచలనాలు ఉంటాయని, 2029 వరకు పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఆయన జోస్యం చెప్పారు. కాగా, గతంలో కేసీఆర్, జగన్ విషయంలో వేణు స్వామి అంచనాలు తప్పినప్పటికీ, తాజాగా లోకేష్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? వేణు స్వామి చెప్పినట్లుగా 2026లో లోకేష్ డిప్యూటీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా? లేక మరేదైనా పదవి దక్కొచ్చా? అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.