`చిన్నారి పెళ్లికూతురు` సీరియల్‌తో దేశమంతా పాపులర్ అయిన నటి అవికా గోర్. తెలుగులో `ఉయ్యాల జంపాల`, `సినిమా చూపిస్త మావ` వంటి హిట్ సినిమాలతో మనకు బాగా దగ్గరయ్యారు. గతేడాది మిలింద్ చద్వానీని పెళ్లి చేసుకున్న ఈమె, ప్రస్తుతం అటు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు.
అయితే తాజాగా అవికా తన సోషల్ మీడియాలో ``కొత్త ప్రారంభం`` అనే క్యాప్షన్‌తో ఒక పోస్ట్ పెట్టారు. అది చూసిన నెటిజన్లు అవికా తల్లి కాబోతోందని, అందుకే అలా పోస్ట్ చేసిందని ఫిక్స్ అయిపోయారు. ఆ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది ఆమెకు శుభాకాంక్షలు చెప్పడం కూడా మొదలుపెట్టారు. కంగ్రాట్స్ మేడమ్, హెల్తీ బేబీ కావాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
తన గురించి వస్తున్న వార్తలు చూసి అవికా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సాధారణంగా కూల్‌గా ఉండే ఈ బ్యూటీ, తన ప్రెగ్నెన్సీ రూమర్లపై కాస్త ఘాటుగానే స్పందించారు. ``నేను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తల్లో అస్సలు నిజం లేదు. ఒక చిన్న పోస్ట్ చూసి ఇలాంటి వార్తలు ఎలా ప్రచారం చేస్తారు?`` అని ఆమె ప్రశ్నించారు. ఇలాంటి అబద్ధపు వార్తలు తనను చాలా ఇబ్బంది పెడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా వార్తలు వైరల్ చేయవద్దని కోరారు.
అయితే, తను గర్భవతిని కాదని చెబుతూనే నెటిజన్లకు ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు అవికా. ``మీరు అనుకుంటున్న గుడ్ న్యూస్ అయితే ఇది కాదు కానీ.. నా జీవితంలో నిజంగానే ఒక అద్భుతమైన వార్త ఉంది. అది ఏంటన్నది ఇప్పుడే చెప్పలేను. దానికి ఇంకా సమయం ఉంది`` అంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో అది ఆమె కొత్త సినిమా గురించో లేక కెరీర్‌కు సంబంధించిన అప్‌డేటో అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి పోస్ట్ పెట్టిన పాపానికి ప్రెగ్నెంట్ ను చేసేయడంతో నెటిజన్ల అత్యుత్సాహంపై అవికా కాస్త గట్టిగానే ఫైర్ అయ్యారు.