వైసీపీ ఎమ్మెల్యేలకు జీతం ఇచ్చే విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అదే విధంగా అటు అసెంబ్లీ వ్యవహారాలు నడిపే స్పీకర్ అయినపాత్రుడు కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. సభకు రాకుండా బయట నుంచి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారనేది ఒక విమర్శ అయితే జీతం తీసుకుంటున్నారు అనేది మరో విమర్శ. సభకు వచ్చి జీతం తీసుకోవడం వరకు ఎవరికీ అభ్యంతరం లేదు.
కానీ సభకు రాకుండా.. సభలో కనీసం కనిపించకుండా.. స్పీకర్ దృష్టిలో కూడా పడకుండానే బయటనుంచి వెళ్ళిపోవటం సంతకాలు చేసిన తర్వాత బిల్లుల కోసం అసెంబ్లీ కార్యదర్శిని కలవడం వంటి విషయాలపై అటు అసెంబ్లీ వర్గాలు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా సీరియస్ గా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడైతే ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఫిబ్రవరి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యేలకు జీతం కట్ చేయాలనేది కీలక ప్రతిపాదనగా కనిపిస్తోంది. దీనిపై తాజాగా జరిగిన సమావేశంలో వారికి ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని వారి నుంచి వివరణ తీసుకోవాలని ఒక సభ్యుడు ప్రతిపాదించారు. అయితే.. దీనికి పరిష్కారంగా అసలు వైసీపీ ఎమ్మెల్యేల వైఖరిని మరోసారి ప్రజల మధ్యకు తీసుకువెళ్లి ప్రజల నుంచే పరిష్కారం తీసుకుందామన్న ఆలోచన మరికొందరు చేశారు.
అయితే.. దీనిపై తుది నిర్ణయానికి ఇంకా రాలేదు. కానీ, వైసిపి సభ్యులకు జీతాలు కట్ చేయాలన్నది కీలక ప్రతిపాదనగా కనిపిస్తోంది. చిత్రం ఏంటంటే వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు గెలవగా వారిలో జగన్ మినహా మిగిలిన పదిమంది జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇతర భత్యాలు(టీఏ, డీఏ, డ్రైవర్ జీతాలు వంటివి) కూడా తీసుకుంటున్నారని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. సభకు రాకుండా జీతం తీసుకోవడం పైన ఇప్పుడు ప్రధాన అభ్యంతరం. మరి దీనిపై వైసీపీ సభ్యులు ఎలా స్పందిస్తారు? చివరకు అసెంబ్లీకి వస్తారా? లేకపోతే జీతాలు వదులుకుంటారా అనేది చూడాలి.