ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గకముందే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్ నెలలో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ లోనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండటంతో, కూటమిలో ముందస్తు కసరత్తు ప్రారంభమైంది. అయితే అసెంబ్లీలో వైసీపీ బలం కేవలం 11 మందికే పరిమితం కావడంతో, ఈసారి పోలింగ్‌కు వెళ్లే సాహసం కూడా చేయకపోవచ్చు. ఫలితంగా ఆ నాలుగు సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కూటమి నుంచి ఢిల్లీ వెళ్లే ఆ లక్కీ ఫోర్ ఎవరు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గతంలో జరిగిన రెండు విడతల రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ చెరి రెండు స్థానాలను పంచుకున్నాయి. అయితే ఈసారి జనసేనకు కూడా వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. గతంలో తమకు రావాల్సిన కోటాను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్, ఈసారి మాత్రం కచ్చితంగా ఒక సీటును ఆశిస్తున్నారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. టీడీపీకి మూడు, జనసేనకు ఒకటి దక్కే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ కేంద్రం నుంచి ఒత్తిడి తెస్తే, టీడీపీ తన కోటా నుంచి ఒక సీటును త్యాగం చేయాల్సి రావచ్చు.
టీడీపీ నుంచి రాజ్యసభ స్థానాల కోసం భారీ పోటీ ఉంది. ప్రస్తుత సభ్యుడు సానా సతీష్ ను మళ్ళీ కొనసాగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనకు ఇదే చివరి అవకాశం అని, పెద్దల సభకు పంపాలని పట్టుబడుతున్నారు. ఆయనకు ఛాన్స్ ఇస్తే బీసీ కోటా కింద ఒక సీటు భర్తీ అవుతుంది. మరోవైపు ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన దేవినేని ఉమా, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న గల్లా జయదేవ్, మరియు దళిత నేత మహాసేన రాజేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు జనసేన నుంచి రాజ్యసభకు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మెగా బ్రదర్ నాగబాబు పేరు మొదట వినిపించినప్పటికీ, సమీకరణాల దృష్ట్యా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన లింగమనేని, చంద్రబాబుకు కూడా ఆత్మీయుడే. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా పార్టీకి అండగా ఉంటుందనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనా, ఏప్రిల్ నాటికి ఏపీ నుంచి ఢిల్లీకి వెళ్లే ఆ నలుగురు నేతలెవరో స్పష్టత రానుంది.