ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాంను నియమించారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబును కోమటి జయరాం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కోమటి జయరాం వెంట ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాం ప్రసాద్, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని తదితరులు ఉన్నారు.
రెండేళ్లపాటు కోమటి జయరాం ఉత్తర అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగనున్నారు. 2014-19 మధ్యకాలంలోనూ ఆయన ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనను రెండోసారి ఆ పదవిలో చంద్రబాబు నియమించారు. ప్రస్తుతం కోమటి జయరాం ఎన్నారై టీడీపీ సమన్వయకర్తగానూ పార్టీకి సేవలందిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి పార్టీలకు మద్దతుగా కోమటి జయరాం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి కూటమి గెలుపులో తన వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.