ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీలో వినిపిస్తోంది. ఎవరైనా.. రోజురోజుకు అభివృద్ధి చెందాలని భావిస్తారు. ఎవరైనా.. రోజు రోజుకు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలని కూడా చూస్తారు. ఇక.. రాజకీయాల్లో అయినా.. అంతే.. ఒక ఓటమి లేదా ఎదురు దెబ్బ నుంచి ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు తేరుకుం టారు. జరిగిన తప్పులు సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ.. ఈ తరహా ఆలోచన వైసీపీలో కనిపించ డం లేదు. నానాటికీ తీసికట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారన్నది రాజకీయాల్లో జరుగుతున్న చర్చ.
ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం జరిగిన టీవీ డిబేట్లలో పలువురు వైసీపీ నాయకులు ఇదే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పారు. రోజు రోజుకు దిగజారుతున్న పార్టీ ని నిలబెట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తారో అర్ధం కావడం లేదని విజయవాడకు చెందిన కీలక నాయకుడు కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కొందరు నాయకులు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతు న్నారు. ఒకప్పుడు ఉన్న భయాందోళనలు ఇప్పుడు లేవు.
ఈ క్రమంలోనే తాజాగా అమరావతి విషయంపై జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర డ్యామేజీ తీసుకురావడంతో నాయకులు ఎలా ఉంటారన్నది ప్రశ్న. ఒక పార్టీ ఇప్పుడు కాకపోతే.. రేపైనా అధికారంలోకి వస్తుందని భావిస్తే.. ఆ పార్టీని అంటిపెట్టుకుని నాయకులు ఉంటారు. ప్రజల మధ్యకువెళ్తారు. కానీ, నాయులు కూడా ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితిని.. వెళ్లినా.. ప్రజలు నిలదీసే పరిస్థితిని పార్టీ అధినేతే కల్పిస్తే.. ఇతర నాయకులు మాత్రం ఎలా ప్రజల మధ్యకు వెళ్తారు. అంతేకాదు.. అసలు పార్టీలో కూడా ఎలా ఉంటారు? అనేది ప్రశ్న.
ప్రస్తుతం అవకాశాలు లేక వైసీపీలో ఉన్నారే తప్ప.. నిజంగా మనసు పెట్టి ఉన్నవారు చాలా చాలా తక్కు వగానే ఉన్నారు. ఇప్పుడు వారు కూడా జగన్ చేసిన అమరావతి వ్యాఖ్యలతో ఖిన్నులవుతున్నారు. దీనివల్ల పార్టీకి జరుగుతున్న డ్యామేజీని జగన్ అర్ధం చేసుకుంటున్నారో లేదో కూడా తెలియడం లేదని బాహాటంగానే అంటున్నారు. సో.. మొత్తంగా అధినేత తీరుతో నాయకులు.. విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధినేత బాటలో తాము నడిస్తే.. తమకు ఇబ్బందేనని అంటున్నవారు కూడా ఎక్కువగా పెరుగుతున్నారు.