తెలంగాణలో వాహనదారులకు సంక్రాంతి పండుగ సందడి వేళ సీఎం రేవంత్ రెడ్డి భారీ షాకిచ్చారు. ఏదైనా వాహనం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన సమయంలో చలాన్ పడ్డ వెంటనే వాహనం ఓనర్ బ్యాంకు ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ అయ్యే విధంగా కొత్త నిబంధన తీసుకురావాలని రేవంత్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ రకంగా వాహనం నంబర్ ను, బ్యాంకు ఖాతాను టెక్నాలజీ సాయంతో అనుసంధానం చేయాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. అయితే, ఈ విధానం ప్రాక్టికల్ గా అమలు చేయడం సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న విధానంలో పెండింగ్ చలానాలు పెరిగిపోతున్న మాట వాస్తవమేనని, కానీ, ఈ విధంగా బ్యాంకు ఖాతాకు పాత వాహనాలు అనుసంధానం చేసే ప్రక్రియ కష్టతరమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
చలాన్ల విషయంలో ఇంత శ్రద్ధ వహిస్తున్న ప్రభుత్వం...టోల్ గేట్ల దగ్గర శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించే విషయంలో మాత్రం జాప్యం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతోపాటు, గుంతల రోడ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని, రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.