టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబోలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి కానుకుగా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఫ్లాప్ లేని దర్శకుడిగా ట్రాక్ రికార్డ్ ఉన్న అనిల్ రావిపూడి దానిని కొనసాగిస్తారా లేదా అన్న సందేహం ఇటు సినీ అభిమానులతోపాటు అటు మెగా అభిమానులలోనూ ఉంది. ఇక, క్రింజ్...మూస కామెడీతో అనిల్ సినిమాలు తీస్తున్నారంటూ విమర్శించే వాళ్లూ లేకపోలేదు. అయితే, ఆ విమర్శకుల నోళ్లు మూయిస్తూ అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టారు.
ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా అభిమానులు రెండ్రోజులు ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. చాలాకాలం తర్వాత వింటేజ్ చిరును చూశామని, ముఖ్యంగా కామెడీ సీన్లలో బాస్ టైమింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక, నయనతారతో బాస్ కెమిస్ట్రీ బాగా కుదిరిందని, భార్యాభర్తల మధ్య ఉండే అలకలు, బుజ్జగింపులను అనిల్ ఎంతో మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశారని చెబుతున్నారు.
ఇక, వెంకీ మామ ఎంట్రీతో సినిమా వేరే లెవల్ కు వెళ్లిపోయిందని...చిరు, వెంకీల కాంబినేషన్లో సీన్లు బాగా పేలాయని అంటున్నారు. కథ, కథనం మామూలే అయినప్పటికీ అనిల్ రావిపూడి తన మార్క్ క్లీన్ కామెడీతో, మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సంక్రాంతికి మరో హిట్ కొట్టారని ప్రశంసిస్తున్నారు. ఆల్రెడీ చిరంజీవిని కలిసిన అనిల్ రావిపూడి సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు.