రూ. 2,653 కోట్లు విడుదల: సంక్రాంతికి ఏపీ స‌ర్కార్‌ బిగ్ సర్ప్రైజ్!

admin
Published by Admin — January 13, 2026 in Politics, Andhra
News Image

ఏపీలో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చేశాయి. పండుగ పూట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు కాంట్రాక్టర్ల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ కూటమి ప్రభుత్వం భారీ సర్‌ప్రైజ్ ప్రకటించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఏకంగా రూ. 2,653 కోట్ల భారీ నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం ఎదురుచూస్తున్న సుమారు 5.70 లక్షల మంది లబ్ధిదారులకు ఈ నిర్ణయం ఒక పెద్ద ఊరటగా మారింది.

ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ఈ నిధులలో సింహభాగం అంటే రూ. 1,100 కోట్లను డీఏ (DA), డీఆర్ (DR) ఎరియర్స్ కోసం కేటాయించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ఆర్థిక వెసులుబాటు కలగనుంది. అటు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమించే పోలీసు సిబ్బందికి కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. 55 వేల మంది పోలీసులకు సంబంధించి సరెండర్ లీవుల బకాయిల కోసం రూ. 110 కోట్లను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నాబార్డు, ఈఏపీ వంటి వివిధ పథకాల కింద రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న పనులకు సంబంధించి రూ. 1,243 కోట్లను విడుదల చేసింది. వీటితో పాటు గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారి, ఏళ్ల తరబడి నిలిచిపోయిన ‘నీరు-చెట్టు’ పనుల బిల్లులకు కూడా మోక్షం లభించింది. ఈ పనుల కోసం దాదాపు రూ. 40 కోట్లు కేటాయించడంతో, సుమారు 19 వేల మంది కాంట్రాక్టర్లకు మేలు జరగనుంది. ముఖ్యంగా 2014-19 మధ్య కాలంలో పనులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న తరహా కాంట్రాక్టర్లు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Tags
AP Government Sankranti 2026 AP Employees CM Chandrababu Naidu Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News