సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు, పిండి వంటలు, కోడి పందాలు.. కానీ ఈసారి గోదావరి జిల్లాల్లో పండుగ సందడి ఆకాశాన్ని తాకనుంది! అవును, మీరు విన్నది నిజమే. ఎప్పుడూ నేల మీద ఉండి చూసే గోదావరి అందాలను, ఈసారి పక్షుల్లా ఆకాశం నుంచి వీక్షించే అద్భుత అవకాశం మీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘విహాగ్’ సంస్థ పర్యాటకుల కోసం నరసాపురంలో ప్రత్యేకంగా హెలికాప్టర్ రైడ్‌ను ఏర్పాటు చేస్తోంది.
ఈ గగన విహారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుంచి ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కేవలం రూ. 5,000 టికెట్ ధరతో సుమారు 25 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తూ 25 కిలోమీటర్ల మేర ప్రకృతి అందాలను తిలకించే వీలు కల్పిస్తున్నారు. పండుగ పూట కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా వెరైటీగా ప్లాన్ చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
ఈ ప్రయాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయ గోపురాన్ని, విశాలమైన సాగర తీరాన్ని, ఆకాశాన్ని తాకేలా ఉండే లైట్ హౌస్‌ను సరికొత్త కోణంలో చూడవచ్చు. వీటన్నింటికీ మించి గోదావరి నది పాయలు సముద్రంలో కలిసే అన్న చెల్లెళ్ల గట్టు దృశ్యం ఆకాశం నుంచి చూస్తుంటే ఒక అద్భుత కావ్యంలా కనిపిస్తుంది. కోనసీమ జిల్లాలోని పచ్చని కొబ్బరి తోటల సోయగాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సీటును ఇప్పుడే బుక్ చేసుకుని ఆకాశంలో విహరించండి!