ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గత రెండేళ్లుగా కుదిపేసిన ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసు ఎట్టకేలకు ఒక తార్కిక ముగింపునకు చేరుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మరో 36 మందిపై నమోదైన ఈ కేసును విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఇది కేవలం 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) అని నిర్ధారిస్తూ సీఐడీ సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. దీంతో చంద్రబాబుపై ఉన్న అతిపెద్ద చట్టపరమైన అడ్డంకి తొలగిపోయినట్లయింది.
నాడు ఏం జరిగింది?
2023, సెప్టెంబర్ 9వ తేదీ శనివారం తెల్లవారుజామున నంద్యాలలో జరిగిన పరిణామాలు ఏపీ రాజకీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయి. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు భారీ బలగాలతో వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ. 3,300 కోట్ల అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. 73 ఏళ్ల వయసులో ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రధాన ప్రతిపక్ష నేతను అలా అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అనంతరం ఆయనను విజయవాడ తరలించి, కోర్టు రిమాండ్ విధించడంతో 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉండాల్సి వచ్చింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు `సీమెన్స్` వంటి సంస్థలతో కలిసి రూ. 3,300 కోట్ల భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో ప్రభుత్వం వాటాగా ఇచ్చిన సుమారు రూ. 370 కోట్లను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని గత ప్రభుత్వం ఆరోపించింది. అయితే, శిక్షణ కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కావడం, వేలమంది యువత లబ్ధి పొందడం వంటి అంశాలను టీడీపీ గట్టిగా వాదిస్తూ వచ్చింది. తాజాగా సీఐడీ సమర్పించిన నివేదికలో ఆ ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని స్పష్టమైంది.
ఈ తీర్పుతో చంద్రబాబుపై గత ప్రభుత్వం చేసిన అవినీతి ముద్ర పూర్తిగా చెరిగిపోయినట్లయింది. సంక్రాంతి పండుగ వేళ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అప్పట్లో ఈ అరెస్ట్ వల్ల కలిగిన సానుభూతి ఎన్నికల్లో కూటమి విజయానికి ఒక కీలక కారణమైతే, ఇప్పుడు కేసు కొట్టివేతతో కూటమి ప్రభుత్వ నైతిక బలం మరింత పెరిగింది.