మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద కనిపిస్తే ఆ సందడే వేరు. తాజాగా ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సంక్రాంతి సందడి థియేటర్లలో ముందుగానే వచ్చేసింది. నిన్న రాత్రి జరిగిన ప్రిమియర్ షోల నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో, ఉదయానికల్లా అది కాస్తా క్లీన్ బ్లాక్ బస్టర్ గా మారిపోయింది.
అటు అమెరికాలో బుకింగ్స్ ప్రారంభమైనప్పుడు కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ, ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల చూపు చిరు సినిమాపై పడింది. దీంతో బుకింగ్స్ ఊపందుకున్నాయి. ఫలితంగా కేవలం ప్రిమియర్స్‌తోనే సినిమా 1.2 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ వేట మొదలైంది.
అయితే ఈ సినిమా విజయం కంటే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన బెట్టింగ్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అదే డైరెక్టర్ అనిల్ రావిపూడి మరియు నిర్మాత సాహు గారపాటి మధ్య జరిగిన ‘కారు’ ఛాలెంజ్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఘనవిజయం సాధించినప్పుడు, నిర్మాత సాహు సంతోషంతో అనిల్ రావిపూడికి ఒక లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. కానీ ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయంలో కథ అడ్డం తిరిగింది.
ప్రమోషన్ల సమయంలో సాహు గారపాటి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ``ఒకవేళ ఈ సినిమా యుఎస్‌లో ప్రిమియర్స్‌తోనే మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటే, ఈసారి నేనే మీకు కారు ఇస్తాను`` అని అనిల్ రావిపూడి నిర్మాతకు సవాల్ విసిరారట. బహుశా ప్రిమియర్స్‌తోనే అంత కలెక్షన్ రావడం కష్టమేమో అని అనిల్ భావించి ఉండవచ్చు. కానీ, మెగాస్టార్ మేనియా ముందు ఆ టార్గెట్ చిన్నదైపోయింది. సినిమా 1.2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడంతో, ఇప్పుడు అనిల్ రావిపూడి తన జేబులోంచి నిర్మాతకు కారు కొనివ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తానికి మెగాస్టార్ హిట్ కొట్టి అందరినీ సంతోషపెడితే.. అనిల్ రావిపూడి మాత్రం సరదాగా చేసిన ఛాలెంజ్‌లో కారు పోగొట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.