టాలీవుడ్‌లో ఒకప్పుడు ఏ ఇద్దరు నిర్మాతలు కలిసినా వినిపించే పేరు శ్రీలీల. `ధమాకా` సినిమాతో ఓ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీని అందరూ 'గోల్డెన్ లెగ్' అని పిలుచుకున్నారు. ఆ డాన్సులు, ఆ ఎనర్జీ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. రవితేజతో కలిసి ఆమె చేసిన సందడికి బాక్సాఫీస్ షేక్ అయ్యింది. దీంతో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి.
కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. `ధమాకా` తర్వాత శ్రీలీల చేసిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మహేష్ బాబుతో చేసిన `గుంటూరు కారం`, రామ్ `స్కంద`, నితిన్ `ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్`, వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ`.. ఇలా అరడజనుకు పైగా సినిమాలు నిరాశపరిచాయి. దీంతో నిన్నటి వరకు గోల్డెన్ లెగ్ అన్న నోళ్లే, ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం షురూ చేశారు.
తెలుగులో అదృష్టం కలిసి రాకపోవడంతో, కోలీవుడ్ వైపు చూపు మళ్ళించింది ఈ చిన్నది. అక్కడ స్టార్ డైరెక్టర్ సుధా కొంగర, హీరో శివకార్తికేయన్ కాంబినేషన్‌లో వచ్చిన `పరాశక్తి` మీద భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శ్రీలీల ప్లాపుల పరంపర తమిళనాడు సరిహద్దులు కూడా దాటేసింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` పైనే ఉన్నాయి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం శ్రీలీల భవిష్యత్తు పవన్ చేతుల్లోనే ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ తో అయినా శ్రీలీల ఫామ్‌లోకి వస్తుందా..? లేదా? అన్నది చూడాలి.