ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి తమ కులదైవం, గ్రామ దేవత నాగాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి తనయుడు లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తన తండ్రి ఖర్జూర నాయుడు, సోదరుడు రామ్మూర్తినాయుడుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు నారావారిపల్లె నుంచి ఉండవల్లి వెళతారు.
కాగా, రాష్ట్రంలోని ప్రతి పల్లె పండుగ శోభతో కళకళలాడుతోందని చంద్రబాబు అన్నారు. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకూ పండుగ వాతావరణం కనిపిస్తోందని, ప్రతి జిల్లాలో ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. పల్లెల్లోకి వెళ్లినవారికి గుంతలు పడ్డ రోడ్లు కనిపించడం లేదని, ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2025లో ప్రజల అవసరాలు తీర్చామని, 2026లో ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు.