మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. నోబెల్ కమిటీ తనకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వకపోయినప్పటికీ మరో రకంగా ఆయన నోబెల్ శాంతి బహుమతిని చేజిక్కించుకున్నారు అనొచ్చు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా విపక్ష నేత మరియ కురినా మచాడో స్వయంగా తనకు వచ్చిన నోబెల్ బహుమతిని తెచ్చి ట్రంప్ చేతుల్లో పెట్టాడం కొస మెరుపు. వెనెజులా సంక్షేమం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ బహుమతిని ఆయనకు అందజేశానని మచాడో చెప్పడం విశేషం.
వెనెజులా భవిష్యత్తుపై ఆయనతో చర్చలు జరిపానని, తన దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ట్రంప్ పై ఆధారపడవచ్చని అన్నారు. మచాడోతో భేటీపై ట్రంప్ స్పందించారు. ఆమె ఇచ్చిన నోబెల్ బహుమతిని అంగీకరిస్తున్నానని చెప్పారు. ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అద్భుతమైన మహిళ అని కితాబిచ్చారు. తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనకు నోబెల్ బహుమతిని అందించారని, పరస్పర గౌరవానికి ఇది మంచి సంకేతం అని ట్రంప్ అన్నారు.
అయితే, ఒకసారి నోబెల్ బహుమతి ఒక వ్యక్తికి ప్రకటించిన తర్వాత దాన్ని రద్దు చేయడంగానీ, బదిలీ చేయడంగానీ జరగదని నోబెల్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. ఆ కమిటీ నిర్ణయమే తుది నిర్ణయమని, అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండబోవని క్లారిటీనిచ్చింది. ఇక, ట్రంప్ నోబెల్ బహుమతిని స్వీకరించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోబెల్ కమిటీ ఇస్తే నోబెల్ బహుమతి ప్రదానం చేసినట్లని, మచాడో ఇస్తే దానం చేసినట్లని ట్రంప్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.