బీజేపీతో తెలంగాణ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే కలుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అనేకసార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం, నిధుల కోసం ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తానని రేవంత్ తేల్చి చెప్పారు.
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తానని, ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ ఆలోచన చేయలేదని, అందుకే తెలంగాణకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. 3 నెలలకు ఒకసారి ప్రధాని మోదీని కలుస్తున్నానని, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నానని అన్నారు. అయితే, అదే సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం అడగవలసిన ప్రాజెక్టులు, నిధులు అడిగి తెచ్చుకుంటున్నానని చెప్పారు.
మోడీని పదేపదే కలుస్తున్నానంటూ కొంతమంది విమర్శిస్తున్నారని, రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఇచ్చేది ప్రధాని కాదా అని ప్రశ్నించారు. ప్రధానిని కలవకుంటే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం నిధులు, ప్రాజెక్టులు అడగలేదని, అడగకపోతే తెలంగాణకు ఏం కావాలో కేంద్రానికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తాను పైరవీలు చేయనని, పర్సనల్ ఎజెండా లేదని క్లారిటీనిచ్చారు.