గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ కీలక నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. మద్యం సరఫరా చేసే డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసి, ఆ నిధులను హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం.
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (SIT) సేకరించిన కీలక ఆధారాలు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ.. ఇందులో విజయసాయి రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 22న ఢిల్లీ లేదా హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా నిబంధనలు ఉల్లంఘించి, మద్యం సిండికేట్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని, ఆ సొమ్మును బినామీ కంపెనీల్లోకి మళ్లించారని ఈడీ తన దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో పలువురు మద్యం వ్యాపారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ, ఇప్పుడు అసలు సూత్రధారుల వైపు అడుగులు వేస్తోంది. తాజా పరిణామంతో సాయిరెడ్డి చుట్టూ మధ్యం స్కామ్ ఉచ్చు బిగుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక 22న జరిగే విచారణలో ఈడీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? విజయసాయి రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.