వైసీపీకి భారీ షాక్.. కీలక మహిళా నేత గుడ్ బై!

admin
Published by Admin — January 17, 2026 in Politics, Andhra
News Image

సంక్రాంతి త‌ర్వాత వైసీపీలో మ‌రోసారి వ‌ల‌స‌ల ప‌ర్వం ఊపందుకోబోతుందా..? వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైన నేతలు కూడా ఇప్పుడు పార్టీకి దూరమవ్వాలని చూస్తున్నారా? అంటే అవున‌న్న స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత, త్వరలోనే ఫ్యాన్ గాలికి స్వస్తి చెప్పి.. గ్లాస్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి, జగన్ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన నేత సుచరిత. 2019లో బంపర్ మెజారిటీతో గెలిచిన ఆమెకు, అనూహ్యంగా హోం మంత్రి పదవి ఇచ్చి జగన్ గౌరవించారు. అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఆమెను పదవి నుంచి తొలగించడంతో తొలిసారిగా విభేదాలు బయటపడ్డాయి. ఆ సమయంలోనే ఆమె రాజీనామాకు సిద్ధపడినా, బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. కానీ, గత ఎన్నికల్లో ఆమెను తన సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడు నుంచి కాకుండా.. తాడికొండకు మార్చడం ఆమెకు ఏమాత్రం రుచించలేదు.

2024 ఎన్నికల్లో జగన్ వ్యూహం బెడిసికొట్టి, తాడికొండలో సుచరిత ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. గత 19 నెలలుగా పార్టీలో ఆమెకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని, ముఖ్యంగా మహిళా నేతలను జగన్ పక్కన పెడుతున్నారనే చర్చ వైసీపీ అంతర్గత వర్గాల్లో నడుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో ఉండటం కంటే.. అధికార కూటమిలో చేరడమే మేలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సుచరిత చూపు జనసేన వైపు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్య నేతలతో ప్రాథమిక చర్చలు ముగిశాయని, సంక్రాంతి పండుగ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ఆమె పవన్ కళ్యాణ్ సమక్షంలో తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే వైసీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గిలిన‌ట్లే అవుతుంది.

Tags
YSRCP Mekathoti Sucharitha Andhra Pradesh AP Politics Jana Sena YS Jagan
Recent Comments
Leave a Comment

Related News