వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు కూడా వచ్చింది. అయితే, ఆ కేసుతో తనకు సంబంధం లేదని, అయినా సరే ఈడీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు వస్తానని సాయిరెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని చెప్పింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు సాయిరెడ్డి గతంలో హాజరై అనేక అంశాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్ అంటూ పోస్టు పెట్టారు. ఈ లిక్కర్ స్కామ్ కు వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి సూత్రధారి అని సాయిరెడ్డి బాంబు పేల్చారు. అంతేకాదు, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డిలతో కేసిరెడ్డి పలుమార్లు భేటీ అయ్యారని సిట్ దృష్టికి తెచ్చారు. కేసిరెడ్డితో పాటు ఆయన బంధువు అవినాష్ రెడ్డి హవాలా మార్గాల్లో డబ్బు తరలించారని అధికారులకు వెల్లడించారు.
ఏది ఏమైనా తాజాగా ఈడీ నోటీసులతో సాయిరెడ్డి జైలుకు వెళతారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు, పవన్ లను సాయిరెడ్డి మచ్చిక చేసుకోవాలని చూశారని నెటిజన్లు అంటున్నారు. బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాలను వాడుకొని జనసేనలో లేదా బీజేపీలో చేరాలని ఆయన అనుకున్నారని, ఆ ప్లాన్ వర్కవుట్ అయినట్లు లేదని కామెంట్స్ చేస్తున్నారు.