నిత్యం ప్రజల సమస్యలు, ప్రభుత్వ పాలనతో బిజీ బిజీగా గడిపే మంత్రినారా లోకేష్..తాజాగా శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడా రు. ఈ నెల 23న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి బైపాస్ రోడ్డులోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(బోగి ఎస్టేట్స్)లో నిర్వహిస్తున్న `మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్-4`(ఎంపీఎల్-4) క్రికెట్ పోటీల్లో లోకేష్ సందడి చేశారు. ముందుగా బోగి ఎస్టేట్స్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఎంపీఎల్-4లో భాగంగా 27వ రోజు, మూడో రౌండ్ ఆఖరి మ్యాచ్ లో వల్లభనేని వెంకట్రావ్ యూత్, విక్కీ 11 జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ టాస్ వేశారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. లోకేష్ రెండు 4లు కొట్టడంతో ప్రాంగణం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. వల్లభనేని వెంకట్రావ్ యూత్ జట్టు టాస్ నెగ్గి బ్యాటింగ్ ను ఎంచుకుంది. అనంతరం ఇరు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ను మంత్రి లోకేష్ వీక్షించారు. క్రికెట్ అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున స్థానిక ప్రజానీకం పాల్గొన్నారు. కాగా.. గత డిసెంబరులో ఈ ప్రీమియర్ లీగ్‌ను నారా లోకేష్ సతీమణి.. నారా బ్రాహ్మణి ప్రారంభించారు. ఈ నెల 23న విజేతలకు 10 లక్షలరూపాయల బహుమతులను అందించనున్నారు.
దీనికి ముందు..
పాత మంగళగిరి 26వ వార్డులో పునర్నించిన హజరత్ అలి పీర్ల పంజా, మదర్సాను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. హజరత్ అలి పీర్ల పంజా, మదర్సా అభివృద్ధికి మంత్రి లోకేష్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముందుగా పీర్ల పంజా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ముస్లీం మతపెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరితో కలిసి ఫోటోలు దిగారు.