ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి విద్యుత్ చార్జీల భారం ఉండదని.. ఆదిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించింది. యూనిట్‌కు దాదాపు 1.20 రూపాయల చొప్పున తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఇది సాకారం అవుతుందని తెలిపింది. 2029 ఎన్నికలకు ఆరు మాసాల ముందే.. విద్యుత్ చార్జీలను గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించింది.
వైసీపీ హయాంలో..
వైసీపీ హయాంలో మద్యం సహా.. విద్యుత్‌ను అప్పటి ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. అయితే.. దీనివల్ల ప్రజలపై ఎనలేని భారం మోపారు. ట్రూ అప్ చార్జీల పేరుతో బాదేశారు. ఫలితంగా గృహ విద్యుత్ వినియోగదారులు ధరలు భరించలేని పరిస్థితికి చేరుకున్నారు. అంతేకాదు.. అనేక సందర్భాల్లో ప్రజలు ఆందోళనకు కూడా దిగారు. అయినా.. జగన్ మొండి పట్టుదలతో వ్యవహరించారు. కనీసం ధరలపై ఒక్కసారి కూడా ఆయన సమీక్ష చేయలేదు. దీనికి కారణాలు కూడా వెతకలేదు.
ప్రస్తుతం..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాకతో .. విద్యుత్ భారాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసింది. అంతేకాదు.. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా పెరిగిన ధరలను నియంత్రించడానికి ముందు.. అప్పట్లో వసూలు చేసిన సొమ్మును గత డిసెంబరు నుంచి సర్దుబాటు చేస్తోంది. తద్వారా డిసెంబరు నుంచి 13 పైసలు చొప్పున గృహ వినియోగ విద్యుత్ దారులకు యూనిట్‌కు తగ్గించారు.
ఇప్పుడు.. ఖర్చులు తగ్గించడంతోపాటు.. విద్యుత్ శాఖ కొనుగోలు చేస్తున్న స్తంభాలు, కండెక్టర్లు, తీగలు, ఇతర ముడిసరుకుల జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ఆ సొమ్మును విద్యుత్ చార్జీల తగ్గింపునకు వాడనున్నారు. ఫలితంగా వచ్చే మూడేళ్లలో యూనిట్ విద్యుత్ రూ.1.20 చొప్పున తగ్గనుంది. తద్వారా వినియోగ దారుల పై భారం మరింత తగ్గుతుందని అధికారులు వివరించారు.