మహిళలకు మేలు కలిగేలా.. వారి మీద ఆర్థిక భారాన్ని మరింత తగ్గించేందుకు వీలుగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎన్నికల హామీని తొలుత అమలు చేసింది కర్ణాటక రాష్ట్రంలోనే. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనతో తర్వాతి కాలంలో తెలంగాణలో.. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో ఈ హామీ ఎంతలా ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. నిజానికి ఈ ఉచిత తాయిలాన్ని సరైన రీతిలో అమలు చేస్తే.. ప్రజల మనసుల్ని గెలుచుకునే వీలుంది. కానీ.. కర్ణాటక.. తెలంగాణ.. ఏపీలో ఈ పథకం మీద పెట్టిన ఫోకస్ తక్కువనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. మరికొద్ది నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్యాడీఎంకే ఆకర్షనీయమైన హామీలతో తొలి విడత మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో అందరిని ఆకట్టుకుంటున్నది మాత్రం పురుషులకు ఉచిత బస్సు పథకం. ఈ పథకాన్ని కేవలం నగర ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ఉండగా.. దీనికి కొనసాగింపుగా అన్నాడీఎంకే తీసుకొచ్చిన ఈ కొత్త తాయిలం రానున్న రోజుల్లో మరికొన్నిపార్టీలు పాలో అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ పథకంతో పాటు.. రేషన్ కార్డు దారులకు ప్రతి నెలా రూ.2వేలు ఇస్తామని.. కుటుంబ దీపం అనే పథకంతో దీన్ని అమలు చేస్తామని అన్నాడీఎంకే చెబుతోంది. అమ్మా ఇల్లం పథకం కింద గ్రామాలు.. నగరాల్లో ఇల్లు లేని ప్రజలకు ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టి ఇస్తామని మరో హామీని ఇచ్చింది అంతేకాదు.. ఒకే కుటుంబంలో ఉండే దళితులు.. వారి పిల్లలకు పెళ్లై కొత్త కాపురం పెడిత.. వారికి కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చి ఇల్లు కట్టి ఇస్తామన్న హామీని పేర్కొన్నారు.
ఉపాధి హామీని కేంద్రం 125 రోజులకు పెంచిన నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే దానిని 150 రోజులకు పెంచుతామని.. రూ.25వేల రాయితీతో 5 లక్షల మందికి అమ్మా టూవీలర్ వాహనాల్ని ఇస్తామని పేర్కొన్నారు. మహిళా కుటుంబ పెద్దకు రూ.వెయ్యి ఇచ్చే పథకం సరిగా అమలు కావటం లేదన్న విమర్శల వేళ.. రేషన్ కార్డులు ఉన్న వారికి రూ.2వేలు ఇస్తామని పరకటించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్షం ఇంత భారీగా తాయిలాలు ఇచ్చిన వేళ.. అధికార డీఎంకే.. ప్రముఖ నటుడు విజయ్ పార్టీ ఎన్నికల హామీలు ఏముంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.