విజనరీ ముఖ్యమంత్రి ఉంటే.. అన్ని శాఖలకూ అవార్డులు, రివార్డులు కామనేనని నిరూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 18 నెలల కాలంలో స్కోచ్ అవార్డులు అందుకున్నారు. ఇక, వ్యక్తిగతంగా విజనరీ ముఖ్యమంత్రి అవార్డును సొంతం చేసుకున్నారు. పాలన పరంగా కూడా ఆయన మంచి ర్యాంకులో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు కూడా ఉత్తమ డిజిటలీకరణ అవార్డు లభించింది.
ఆర్టీసీ బస్సుల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు పెరడంతో ఉత్తరాదిలో ఆర్టీసీ బస్సుల వినియోగం తగ్గింది. కానీ, ఇదేసమయంలో ఉచితాలు అమలు చేస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ బస్సుల వినియోగం పెరిగింది. దీనికి తగిన విధంగా ప్రభుత్వాలు కూడా.. సౌకర్యాలను మెరుగు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రయాణికులకు అందిస్తున్న సేవలను గుర్తించి.. ప్రతిష్టాత్మక అవార్డును అందించారు.
ప్రజారవాణాలో ప్రతిష్టాత్మకంగా భావించే.. ‘గవర్నెన్స్ నౌ- 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్’ అవార్డు దక్కింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ ముందుందని ప్రశంసించారు. ఇది ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి విభాగం కూడా అంకిత భావంతో పనిచేయడం వల్లే ఈ అవార్డు లభించిందని తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు కృషిని అటు సీఎం, ఇటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ప్రశంసించారు.
అవార్డును ఎందుకిచ్చారు?
1) ప్రయాణికులకు ఆర్టీసీ ఉత్తమ సేవలు అందించడం.
2) ముందుగానే సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేయడం.
3) బస్టాండ్లలో రద్దీని నియంత్రించడం.
4) డిజిటల్ పరంగా ఆర్టీసీని మరింత ఉన్నతీకరించడం.
5) ప్రధాన బస్టాప్‌లలో ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ అమలు చేయడం.