మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్ 30వ వర్దంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, పలువురు మంత్రులు పాల్గొన్నా రు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వాస్తవానికి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉందని.. కానీ, మరోవైపు విదేశీ పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు.
తెలుగువారు ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ పెట్టిన కేవలం మూడు మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటికీ తెలుగువారి ఇళ్లలోని దేవుడి మందిరాల్లో ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి ఫొటోలు కనిపిస్తాయని తెలిపారు. రాజకీయంగా అనేక సోపానాలు ఎక్కారని.. అజేయుడిగా నిలిచారని కొనియాడారు. తరతరాలకు ఒక చరిత్రను ఇచ్చిన మహనీయుడిగా ఎన్టీఆర్‌ను ఆయన కొనియాడారు.
మహిళలకు సామాజిక భద్రతతోపాటు.. పేదల ఆకలి తీర్చిన గొప్ప నాయకుడిగా ఎన్టీఆర్ గుర్తుండి పోయారని చెప్పారు. దీనికి ముందు చంద్రబాబు.. ఎక్స్‌లోనూ పోస్టు చేశారు. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవానికి నివాళులు అని పేర్కొన్నారు. తెలుగు జాతి సమున్నతంగా ఉండాలని ఆకాంక్షించిన ఎన్టీఆర్.. అనేక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారని చెప్పారు. సాగు, తాగునీటికి పెద్దపీట వేశారని.. పేదలకు రూ.2కే కిలో బియ్యాన్ని అందించి ఆకలి తీర్చారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని చంద్రబాబు చెప్పారు.