టీడీపీకి రఘురామ గుడ్‌బై.. రాజీనామాపై RRR క్లారిటీ!

admin
Published by Admin — January 19, 2026 in Politics, Andhra
News Image

ఏపీ పాలిటిక్స్‌లో రాజ్యాంగబద్ధమైన పదవులు.. రాజకీయ విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (RRR) చుట్టూ జరుగుతున్న పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన తన పదవికి, అలాగే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, తన రాజకీయ భవిష్యత్తు మరియు పార్టీ సభ్యత్వంపై రఘురామ కృష్ణంరాజు గట్టి క్లారిటీ ఇచ్చారు.

సాధారణంగా స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవులను రాజ్యాంగబద్ధమైనవి అంటారు. అంటే, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకూడదు. అయితే, రఘురామ కృష్ణంరాజు మాత్రం తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ర‌ఘురామ డిప్యూటీ స్పీకర్గా కాకుండా టీడీపీ నేతలా మాట్లాడడం పై అభ్యంతరాలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వానికి సైతం ఫిర్యాదులు అందాయి. దీనిని సాకుగా చూపిస్తూ, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కూడా ఆయనపై ఫిర్యాదులు చేశారు. అలాగే బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాల విషయంలో రఘురామ తప్పు చేశారని, ఒక ఆర్థిక నేరగాడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉండకూడదని ఆయన వాదిస్తున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో రఘురామ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది.

ఈ విమర్శలపై రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ.. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారే తన రాజీనామాను కోరుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన మాతృ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ``నేను టీడీపీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. నిబంధనలకు లోబడే నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను`` అని ఆయన తేల్చి చెప్పారు.

రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తిప్పికొట్టారు. డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తాను టీడీపీ పార్టీ అంతర్గత సమావేశాలకు వెళ్లడం లేదని, కేవలం ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ సమస్యలపై, ప్రజా ప్రయోజనాలపై మాత్రమే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయకపోయినా, రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Tags
Deputy Speaker Raghurama Krishnam Raju TDP Ap Politics YSRCP RRR IPS Sunil Kumar
Recent Comments
Leave a Comment

Related News