టాలీవుడ్ బుట్టబొమ్మ అనగానే గుర్తుకువచ్చే పేరు పూజా హెగ్డే. ఇప్పటివరకు కేవలం గ్లామర్, తన నటనతో వార్తల్లో నిలిచిన ఈ పాన్ ఇండియా బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన కెరీర్ ప్రారంభంలో ఒక స్టార్ హీరో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దానికి ప్రతిగా తాను అతడి చెంప పగలగొట్టానని పూజ సంచలన నిజాన్ని బయటపెట్టింది.
పూజా హెగ్డే తన కెరీర్ మొదట్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ చేదు అనుభవం ఎదురైందట. ``నేను షూటింగ్ గ్యాప్‌లో నా క్యారవాన్‌లో ఉన్నప్పుడు, ఆ సినిమా హీరో నా అనుమతి లేకుండా లోపలికి వచ్చాడు. మొదట అది సాధారణ సందర్శన అనుకున్నాను కానీ, అతని ప్రవర్తన తేడాగా అనిపించింది. అసభ్యంగా ప్రవర్తిస్తూ హద్దులు దాటడానికి ప్రయత్నించాడు.`` అని పూజ ఆవేదన వ్యక్తం చేసింది.
అప్పటివరకు ఎంతో మర్యాదగా ఉన్న పూజ, ఆ హీరో ప్రవర్తనతో ఒక్కసారిగా షాక్‌కు గురైందట. ``ఆ క్షణంలో నాకు మరేం ఆలోచన రాలేదు. నా ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు అనిపించింది. అందుకే సహనం కోల్పోయి అతడిని లాగిపెట్టి కొట్టాను. ఆ దెబ్బతో షాక్ అయిన ఆ హీరో, వెంటనే క్యారవాన్ వదిలి వెళ్లిపోయాడు`` అంటూ బుట్టబొమ్మ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటన తర్వాత ఆ స్టార్ హీరో ముఖం చూడటం కూడా పూజాకు ఇష్టం లేకపోయిందట. కానీ సినిమా మధ్యలో ఆపేస్తే నిర్మాతలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో, ఆ హీరోతో కలిసి నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను డూప్‌తో కంప్లీట్ చేసిందట. అయితే ఆ స్టార్ హీరో ఎవరు? అన్నది మాత్రం రివీల్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ హీరో ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పూజా హెగ్డే నటించిన పాత సినిమాల లిస్టును నెటిజన్లు జల్లెడ పడుతున్నారు.