జపాన్...రెండు అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం. అమెరికా ఆటం బాంబులు వేసిన తర్వాత జపాన్ కోలుకుంటుందా? అని ప్రశ్నించిన వారే ఎక్కువ. ఆఫ్రికా మాదిరి పేదరికంతో కొట్టుమిట్టాడుతుందని బల్లగుద్ది మరీ చెప్పిన వారే ఎక్కువ. కానీ, జపాన్ గోడకు కొట్టిన బంతిలా పుంజుకుంది. అందరినీ ఆశ్చర్య పరుస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్లింది. అయితే, ఆ క్రెడిట్ కేవలం అక్కడి ప్రభుత్వానిదే కాదు. అక్కడి ప్రజలది కూడా. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కూడా ఏపీ ప్రజలు జపాన్ వాసుల నుంచి స్ఫూర్తి పొందాలి.
అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ సర్కార్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు రీస్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వం తరఫు నుంచి అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన అన్ని పనులూ చేస్తోంది. నిధులు కూడా కేటాయిస్తోంది. పీ4 పద్ధతిలో ఎన్నారైలు, ప్రజలను కూడా అందులో భాగస్వాములను చేస్తోంది. అయితే, సామాన్య ప్రజలు కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన అవసరముంది. అందుకే, ప్రజల నుంచి అమరావతి నిర్మాణం కోసం విరాళాల సేకరించేందుకు సీఆర్డీఏ సరికొత్త విధానినికి శ్రీకారం చుట్టింది.
అమరావతి రాజధాని నిర్మాణానికి డొనేట్ చేయాలనుకునే వారి కోసం క్యూఆర్ కోడ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చింది. సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్‌లో క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని కల్పించింది.
ఏపీ సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్ crda.ap.gov.in లో “Donate for Mana Amaravati” అనే ప్రత్యేక ఆప్షన్ తోపాటు UPI QR కోడ్ అందుబాటులో ఉంచింది. దాతలు తమ ఫోన్‌లలో గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సురక్షితంగా, సులభంగా విరాళాలు పంపవచ్చు. అంతేకాదు, విరాళం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకంతో కూడిన డిజిటల్ రసీదు కూడా పొందవచ్చు