టాలీవుడ్ లో మరో కొత్త వార్ మొదలైంది. సినిమా పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. బయటికి కనిపించే మెరుపుల వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, మరెన్నో త్యాగాలు ఉంటాయి. ఇటీవల ఒక సినిమా సక్సెస్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ క్రమశిక్షణపై చర్చను లేపగా, సింగర్ చిన్మయి దానికి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెను సంచలనంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ``సినిమా ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది. మనం ఎంత కమిట్‌మెంట్ తో పని చేస్తే, అది మనకు అంతటి గౌరవాన్ని, ఫలితాన్ని తిరిగి ఇస్తుంది`` అని పేర్కొన్నారు. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కాల్సిన పనిలేదని, పని పట్ల శ్రద్ధ ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుందని ఆయన యువ నటీనటులకు హితబోధ చేశారు. అదే సమయంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని చిరు తేల్చి చెప్పారు.
అయితే, చిరంజీవి వాడిన `కమిట్‌మెంట్` అనే పదంపై సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీలో ఒక మహిళకు కమిట్‌మెంట్ అనే మాటకు ఎదురయ్యే అనుభవాలు వేరని ఆమె కుండబద్దలు కొట్టారు. ``పెద్దలు చెప్పే కమిట్‌మెంట్ అంటే పని పట్ల నిబద్ధత కావచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో మహిళల నుంచి ఆశించే కమిట్‌మెంట్ అంటే లైంగిక లొంగుబాటు`` అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో ఇండస్ట్రీని అద్దంలాంటిదని చెబితే సరిపోదని, లోపల ఉన్న మురికిని కడిగేయడం ముఖ్యం అంటూ ఆమె సంచలన పోస్ట్ చేశారు.
చిన్మయి తన పోస్ట్‌లో కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. గతంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, ముఖ్యంగా గీత రచయిత వైరాముత్తుపై చేసిన ఆరోపణలను మరోసారి గుర్తు చేశారు. ఒక మహిళా మ్యూజిషియన్ స్టూడియోలో వేధింపులు భరించలేక వృత్తిని వదిలేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఇండస్ట్రీలో వేధింపులు ఒక నిత్యకృత్యంగా మారాయని ఆరోపించారు. సీనియర్లు పాత రోజులను గుర్తు చేసుకుంటూ మాట్లాడటం బాగుంటుంది కానీ, ప్రస్తుత కాలంలో యువతులు ఎదుర్కొంటున్న వేధింపుల వాస్తవాలను కూడా గుర్తించాలని ఆమె చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు.