ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపిన `యువగళం` పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం కుప్పం గడ్డపై శ్రీ వరదరాజస్వామి సాక్షిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం, కేవలం ఒక నడకగా కాకుండా.. రాష్ట్ర రాజకీయాల గమతినే మార్చిన ఒక పొలిటికల్ సునామీగా నిలిచింది. మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ఈ సాహసోపేత యాత్ర, నేడు తెలుగుదేశం పార్టీ విజయకేతనానికి పునాదిగా మారింది.
యువగళం ప్రారంభమైనప్పుడు అనేక విమర్శలు, అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ, లోకేశ్ వెనకడుగు వేయలేదు. ఎండనక, వాననక 226 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ఆయన 3,132 కిలోమీటర్లు నడిచారు. 11 ఉమ్మడి జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, సామాన్యుడి కష్టాలను స్వయంగా విన్నారు. ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమైన తీరు లోకేశ్‌ను ఒక మాస్ లీడర్ గా నిలబెట్టింది.
యువగళం కేవలం పాదయాత్రగా మాత్రమే మిగిలిపోలేదు, అది ఎన్నికల ఫలితాలను తలకిందులు చేసిన గేమ్ ఛేంజర్ అయ్యింది. లోకేశ్ ఏ ఏ నియోజకవర్గాల మీదుగా అయితే నడిచారో, అక్కడ కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. లోకేశ్ పర్యటించిన 97 నియోజకవర్గాల్లో ఏకంగా 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం విశేషం. దాదాపు 93 శాతం సక్సెస్ రేటు సాధించి, ఒక పాదయాత్ర ఎన్నికలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో లోకేశ్ నిరూపించారు. భారత రాజకీయాల్లో ఒక యువనేత చేపట్టిన యాత్రకు ఈ స్థాయి ఫలితాలు రావడం ఒక అరుదైన రికార్డుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఇక యువగళం ప్రభంజనానికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంగళవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యాలయానికి చేరుకున్న లోకేశ్‌కు నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.