కేసీఆర్ చుట్టూ ఉన్న `దెయ్యం` అత‌నే.. కవిత సంచ‌ల‌నం

admin
Published by Admin — January 27, 2026 in Politics, Telangana
News Image

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి `డియర్ డాడీ` లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ కవిత, అప్పట్లో తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో ప్రస్తావించిన దెయ్యం ఎవరనే సస్పెన్స్‌కు తాజాగా తెరదించారు. ఎవరూ అడగకపోయినా, ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ చుట్టూ ఉండి పార్టీని, ఉద్యమకారులను నాశనం చేసిన ఆ దెయ్యం మరెవరో కాదు.. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావేనని కవిత కుండబద్దలు కొట్టారు.

తన తండ్రి కేసీఆర్‌ను దేవుడిగా అభివర్ణించిన కవిత, ఆయన చుట్టూ చేరిన శక్తులే పార్టీని భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. ముఖ్యంగా ప్రజా కవి, దివంగత గద్దర్ కు జరిగిన అవమానాన్ని ఆమె గుర్తు చేశారు. ``గద్దర్ అన్న ఎన్నోసార్లు కేసీఆర్ గారిని కలిసేందుకు పార్టీ ఆఫీసుకి వస్తే, కనీసం గేటు కూడా తీయనివ్వకుండా సంతోష్ రావు అడ్డుకున్నారు`` అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గద్దర్ మాత్రమే కాదు, ఉద్యమ కాలం నుంచి ఉన్న ఎంతో మంది సీనియర్ నేతలను, మేధావులను సంతోష్ రావు తన అహంకారంతో దూరం చేశారని, ఆ వల్లే పార్టీ ఈ పరిస్థితికి వచ్చిందని ఆమె విమర్శించారు.

ప్రస్తుతం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో తెర వెనుక ఎన్ని పాత్రలు ఉన్నా, అసలు సూత్రధారి, పాత్రధారి సంతోష్ రావేనని ఆమె పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిగా వ్యవహరిస్తున్నారని మరో బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డితో ఆయనకున్న ఈ రహస్య సంబంధాల వల్లే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం తనకు లేదని కవిత అభిప్రాయపడ్డారు. పార్టీని నాశనం చేసి, తండ్రీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టిన సంతోష్ రావుకు కఠిన శిక్ష పడాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కవిత పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Tags
Kavitha Santosh Rao KCR BRS Telangana Politics Phone Tapping Case Revanth Reddy
Recent Comments
Leave a Comment

Related News