ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే ``రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ``. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఎక్స్ (ట్విట్టర్) మీమ్స్ వరకు, చివరకు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ ఫ్యాక్టరీ గురించే చర్చ. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఒక భారీ గోటీల ఫ్యాక్టరీని స్థాపించారని, అందులో వేల సంఖ్యలో ఉద్యోగాలంటూ జరుగుతున్న ప్రచారం చూస్తుంటే ఎవరికైనా మైండ్‌బ్లాక్ అవ్వాల్సిందే.
అసలు కథ ఎక్కడ మొదలైందంటే, ఒక యూట్యూబర్ సరదాగా చేసిన క్రియేటివ్ వీడియోతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. దానికి తోడు మరికొందరు నెటిజన్లు తోడై.. ``నాకు జాబ్ వచ్చింది``, ``నాకు లక్షల్లో జీతం ఇస్తున్నారు``, ``నేను ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను`` అంటూ సెల్ఫీ వీడియోలు వదలడంతో జనాల్లో అనుమానం మొదలైంది. కొందరైతే ఏకంగా ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు కూడా సృష్టించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దీంతో ఇది కేవలం సరదా మాత్రమే కాదు, ఏదో సీరియస్ మేటర్ అనే రేంజ్‌కు వెళ్ళిపోయింది.
అసలు మిస్టరీ ఏంటంటే.. నిజానికి రాజశేఖర్ గారికి ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదు. అవును, మీరు విన్నది నిజమే. ఇదంతా సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఒక వర్చువల్ భ్రమ. ఆయన పేరు మీద ఎలాంటి కంపెనీ రిజిస్ట్రేషన్ లేదు, అసలు ఆయనకు ఈ విషయంతో సంబంధమే లేదు. కానీ, మీమ్స్ చేసే వాళ్లు దీనిని ఒక రేంజ్‌లో ఎలివేట్ చేయడంతో, అమాయక జనం ఇది నిజమని నమ్మి ఉద్యోగాల కోసం వెతకడం మొదలుపెట్టారు.
ఇప్పటివరకు ఇది ఒక ఫన్నీ ట్రెండ్‌లాగే ఉన్నా, దీని వెనుక పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. ఈ ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగే అవకాశం ఉంది. ``రాజశేఖర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తాం.. ఈ లింక్ క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి`` అంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గోటీల ఫ్యాక్టరీ మోజులో పడి జేబులు ఖాళీ చేసుకునే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, ఒక చిన్న మీమ్ ఎంతటి గందరగోళానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ గోటీల ఫ్యాక్టరీ ఒక పెద్ద ఉదాహరణ. రాజశేఖర్ టీమ్ దీనిపై అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ వెర్రి ట్రెండ్‌కు ఫుల్‌స్టాప్ పడేలా లేదు.