న్యూఢిల్లీ: సాధారణంగా పార్లమెంట్ అంటే దేశ రక్షణ, సరిహద్దు వివాదాలు, బడ్జెట్ కేటాయింపులు వంటి గంభీరమైన చర్చలు జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, వైసీపీకి చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం రూట్ మార్చారు. జనాలకు ఉపయోగపడే `ముక్క` సూత్రాన్ని పట్టుకున్నారు. సాక్షాత్తూ లోక్‌సభలో నాటుకోడి ధరల మీద పంచాయితీ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఏపీలో నాటుకోడి ధరలు చుక్కలను తాకుతున్నాయని, అసలు అవి మటన్ రేటు కంటే ఎక్కువగా పెరిగిపోయాయని అవినాష్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేశారు. పాపం.. ఆయన ఏ హోటల్లో ఆర్డర్ ఇచ్చారో ఏమో కానీ, నాటుకోడి రేటు చూసి బెంబేలెత్తిపోయి నేరుగా పార్లమెంట్లో ప్రశ్న వేశారు. ``అయ్యా మంత్రి గారు.. నాటుకోడి రేటు మటన్ కంటే ఎక్కువైపోయింది, ఈ విషయం మీకు తెలుసా? పోనీ, పౌల్ట్రీ రైతులకు ఏమైనా బీమా ఉందా?`` అంటూ సీరియస్ క్వశ్చన్ సంధించారు.
అవినాష్ రెడ్డి వేసిన ప్రశ్నకు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి గారు ఏపీ ప్రభుత్వం నుంచే సమాచారం తెప్పించుకుని మరీ ఎంపీ గారికి కౌంటర్ ఇచ్చారు. ``అయ్యా ఎంపీ గారు.. మీ లెక్కలు ఎక్కడివో మాకు తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన నివేదిక ప్రకారం అక్కడ నాటుకోడి కిలో రూ. 500 ఉంటే, మటన్ కిలో రూ. 900 ఉంది. అంటే మటన్ కంటే కోడి చాలా తక్కువ ధరకే దొరుకుతోంది. కాబట్టి మీరు అడిగిన ఇతర ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు`` అని సుతిమెత్తగా చురకలు అంటించారు.
ఇక ఈ వార్త బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. ``సార్.. మీరు ఏపీలో తింటున్నారా? లేక విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా?`` అని కొందరు, ``కోడికి, మేకకు తేడా తెలియని వారు కూడా ధరల మీద ప్రశ్నలు వేస్తున్నారు`` అని మరికొందరు రచ్చ చేస్తున్నారు. మొత్తానికి పార్లమెంట్లో అవినాష్ రెడ్డి చేసిన ఈ నాటుకోడి పంచాయితీ మాత్రం ఆయన పరువు తీయడమే కాకుండా, విపక్షాలకు మంచి ఆయుధంగా దొరికింది. ప్రజా సమస్యలు అంటే ధరల పెరుగుదల గురించి మాట్లాడటం మంచిదే కానీ, మేక ధర కంటే కోడి ధర ఎక్కువని పార్లమెంట్లో ఫిర్యాదు చేసే ముందు.. కనీసం మార్కెట్ రేట్లైనా కనుక్కుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.