అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య తాజాగా జరిగిన సుదీర్ఘ భేటీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు వైకాపా శిబిరంలో వణుకు పుట్టిస్తున్నాయి. కేవలం పరిపాలన పరమైన అంశాలే కాకుండా, రాబోయే రోజుల్లో వైసీపీని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ వ్యూహాలను చిత్తు చేయడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. వైసీపీ వేస్తున్న ట్రాప్ లో పడకుండా, కూటమి కేడర్ అంతా కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై బాబు-పవన్ ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా రాకుండా చూసుకోవాలని, సోషల్ మీడియాలో వైసీపీ చేసే తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఈ ఉమ్మడి కార్యాచరణ ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారబోతోంది.
రాజకీయంగా అత్యంత కీలకమైన నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై కూడా ఈ భేటీలో ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎవరిని ఢిల్లీకి పంపాలి? ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? అనే విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. దీనితో పాటు, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ (SIT) నివేదికపై కూడా ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ అంశంలో వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో కూడా ఒక రోడ్ మ్యాప్ రెడీ చేశారు. మొత్తం మీద, చంద్రబాబు అనుభవం.. పవన్ కళ్యాణ్ వేగం తోడైతే, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు ఖాయమని అర్థమవుతోంది. బాబు-పవన్ జోడీ తీసుకున్న ఈ బిగ్ డెసిషన్స్తో ఇప్పుడు వైసీపీ కోటలో కలవరం మొదలైందన్నది మాత్రం వాస్తవం.