తెలుగులో సంక్రాంతి సినీ సందడి తర్వాత అందరి దృష్టీ సమ్మర్ సీజన్ మీదికి మళ్లుతుంది. మార్చి ద్వితీయార్ధం నుంచే క్రేజున్న సినిమాలు రిలీజవుతుంటాయి. ఐతే ముందు మార్చి నెలాఖరుకు అనుకున్న పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలు వాయిదా పడిపోవడంతో వాటి కోసం సినీ అభిమానులకు నిరాశ తప్పలేదు. మరోవైపు మార్చి 19కి అనుకున్న ‘డెకాయిట్’ సైతం వాయిదా పడిపోయింది. దీంతో క్రేజీ డేట్లు వృథా అయిపోతున్నాయే అన్న చర్చ మొదలైంది. కానీ మార్చిలో తెలుగు ప్రేక్షకులు మరీ నిరాశ చెందకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వస్తుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మార్చి 26న ఈ సినిమా రావచ్చని ప్రచారం జరిగింది. కానీ మార్చిలో కాదు, ఏప్రిల్లో ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చని ఇంకో వార్త కూడా హల్‌చల్ చేస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.
ఐతే ఈ అయోమయానికి బుధవారం సాయంత్రం తెరపడబోతోంది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టీం వెల్లడించింది. రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను సాయంత్రం 4.15 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో అందరూ ఆ టైం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేయాలని కోరుకుంటున్నారు. వారి దృష్టంతా మార్చి 26 డేట్ మీదే ఉంది. మరి టీం ఉద్దేశం ఎలా ఉందో చూడాలి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా నుంచి మధ్యే వచ్చిన ‘దేఖ్‌లేంగే సాలా’ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.