రిలీజ్ కు ముందు నాగవంశీ మిస్సింగ్!

admin
Published by Admin — October 30, 2026 in Movies
News Image

నాగవంశీ అంటే పేరుకు సితార ఎంటర్టైన్మెంట్స్‌కు అధినేత కానీ.. దీని మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటారు. తన బాబాయి రాధాకృష్ణ చాలా వరకు తెర వెనుకే ఉంటారు. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ చూసేది నాగవంశీనే. ఆ బేనర్లో సినిమా రిలీజైనా హడావుడి అంతా నాగవంశీ చుట్టూనే ఉంటుంది. సినిమా ఈవెంట్లలో, ప్రమోషన్లలో నాగవంశీ సందడి చేస్తుంటాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు. 

కానీ ఆశ్చర్యకరంగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రమోషన్లలో మాత్రం నాగవంశీ కనిపించడం లేదు. కొన్ని రోజుల ముందు వరకు యాక్టివ్‌గానే ఉన్న నాగవంశీ.. రిలీజ్ టైంకి మాయమైపోయాడు. కొన్ని రోజుల కిందట మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనలేదు. తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా కనిపించలేదు. ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా నాగవంశీ భాగం కాలేదు. సోషల్ మీడియాలో సైతం నాగవంశీ అంత యాక్టివ్‌గా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన చుట్టూ ఇటీవల బాగా నెగెటివిటీ ముసురుకున్న నేపథ్యంలో.. దాని ప్రభావం సినిమా మీద పడకుండా ఉండేందుకే నాగవంశీ ఇలా చేస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌ను పదే పదే మార్చడం, తద్వారా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేయడం.. అలాగే చిన్న సినిమాలకు ఇబ్బందులు కలిగించడం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ఏపీలో టికెట్ల రేట్లు పెంచడం మీదా నాగవంశీ వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కొన్ని రోజులుగా నాగవంశీ మీద బాగా ట్రోలింగ్ నడుస్తోంది. 

ఈ నేపథ్యంలోనే నాగవంశీ ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్లకు, ప్రమోషన్లకు దూరంగా ఉన్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్, రిలీజ్ వ్యవహారాలతో నాగవంశీ బిజీగా కూడా ఉండొచ్చని.. సితార సినిమాలకు ఎలాగూ తనే ముందుంటా కాబట్టి, హారిక అండ్ హాసిని బేనర్లో ఎప్పుడో ఒక సినిమా రిలీజవుతుంది కాబట్టి ఇప్పుడైనా తన బాబాయి ఫేస్ ముందు కనిపించాలని కూడా నాగవంశీ వెనక్కి వెళ్లిపోయి ఉండొచ్చు. ఏదేమైనా మీడియాకు, సోషల్ మీడియాకు ఎప్పుడూ మంచి కంటెంట్ ఇచ్చే నాగవంశీ.. తెర ముందు కనిపించకపోవడం కొంచెం వెలితిగానే ఉంది.

Tags
Producer nagvanshi missing before release aadarsa kutumbam
Recent Comments
Leave a Comment

Related News