కేసీఆర్ జాతి పిత ఎలా అవుతారు: రేవంత్

admin
Published by Admin — February 05, 2026 in Politics, Telangana
News Image

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న మాట‌ల దాడిని కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న జాతి పిత ఎలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. అవినీతి, అక్ర‌మాలు, కుటుంబ రాచ‌రికాన్ని ప్రోత్స‌హించిన వ్య‌క్తి తెలంగాణ‌కు జాతిపితా? అని ప్ర‌శ్నించారు. అనేక ఆశ‌లు-ఆకాంక్ష‌ల‌తో వ‌చ్చిన రాష్ట్రాన్ని త‌మ స్వార్థం కోసం వాడుకున్న వారు జాతిపిత‌లా? అని నిల‌దీశారు. తాజాగా ఆయ‌న మిర్యాలగూడ‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ‘ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ’ సభలో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్ హ‌యాంలో ఒక్క కుటుంబానికైనా మేలు జ‌రిగిందా? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం త‌న కుటుంబానికి మాత్ర‌మే ప‌ద‌వులు ఇచ్చుకున్నార‌ని సీఎం విమ‌ర్శించారు. పేద‌లు త‌మ పొట్ట పోసుకోవ‌డం కోసం రేష‌న్ కార్డు అడిగితే వారిని దొంగ‌ల్లా చూశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప‌దేళ్ల‌పాటు రేష‌న్ కార్డు కోసం ఎదురు చూడాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇలాంటి వారికా జాతిపిత బిరుదులు ఇవ్వాల్సింది.. అని వ్యాఖ్యానించారు. స‌న్న‌బియ్యం పండించొద్ద‌న్న వ్య‌క్తులు.. ఇప్పుడు తాము స‌న్న‌బియ్యం పేద‌ల‌కు ఇస్తుంటే చూసి ఓర్వ‌లేక పోతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేద‌ల‌కు రేష‌న్ కార్డులు ఇవ్వ‌డంతోపాటు వారికి ఆరు కిలోల‌చొప్పున స‌న్న బియ్యా న్ని ఇస్తున్నామ‌ని సీఎం తెలిపారు. 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామ‌ని సీఎం వివ‌రిం చారు. ``సన్న బియ్యం తీసుకునేవారు.. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలి.`` అని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి రేవంత్ రెడ్డి పిలుపుప‌నిచ్చారు. ఎన్నిక‌లు ఏవి వ‌చ్చినా.. కాంగ్రెస్ గెలుపున‌కు ఎదురే లేదని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పాల‌న‌కు కాంగ్రెస్ పాల‌న‌కు మ‌ధ్య వ్య‌త్యాసం చూడాల‌ని సూచించారు.

ఎన్నిక‌లు ముగిశాక‌..

ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని.. ఇవి ముగియ‌గానే పేద‌ల‌కు ఇళ్లు మంజూరు చేయ‌నున్న‌ట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రైతు భ‌రోసా నిధులు కూడా ఇస్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల కోసం కోటి 10 రూపాయ‌ల మేర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు వివ‌రించారు. పేద‌ల ఆత్మ గౌర‌వం కోసం తాము ప‌నిచేస్తున్నామ‌న్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మాదిరిగా వేధించ‌బోమ‌ని చెప్పారు. 

Tags
Revanth Reddy KCR Telangana Telangana Politics Latest News
Recent Comments
Leave a Comment

Related News