వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. జగన్ దంపతులే నెక్స్ట్ టార్గెట్‌!

admin
Published by Admin — February 05, 2026 in Politics, Andhra
News Image

గత ఐదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న వివేకా హత్య కేసు తుది ఘట్టానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో సిబిఐ దాఖలు చేసిన నివేదికలో దర్యాప్తు పూర్తయిందని పేర్కొన్నప్పటికీ, ట్రయల్ కోర్టు సూచనల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హం. అంటే, ఈ కేసులో ఇప్పటివరకు బయటకు రాని మాస్టర్ మైండ్ ఎవరనే కోణంలో లోతైన విచారణ ఇంకా జరుగుతూనే ఉందని స్పష్టమవుతోంది.

అయితే ఈ కేసులో మొదటి నుంచీ వివేకా కుమార్తె సునీత రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. హత్య వెనుక ఉన్న అసలు కుట్రదారులను బయటకు తీసుకురావాలని, ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు వైఎస్ భారతీ రెడ్డిలను కూడా విచారించాలని ఆమె గట్టిగా కోరుతున్నారు. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలు, సాక్ష్యాల తారుమారు అంశాల్లో వీరి పాత్రపై విచారణ జరగాలని సునీత బృందం పట్టుబడుతోంది.

కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరిస్థితి ఏంటి? 
జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ ధర్మాసనం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరినైనా విచారించాల్సి వస్తే, కోర్టు అనుమతితో ముందుకు వెళ్లవచ్చని న్యాయమూర్తి సూచించారు. దీంతో, సీబీఐ గనుక వీరిద్దరిని విచారించేందుకు అనుమతి కోరితే అది ఏపీ రాజకీయాల్లోనే అతిపెద్ద మలుపు అవుతుంది. ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ విచారణ తిరుగుతుండగా, ఇప్పుడు నేరుగా జగన్ దంపతుల పేర్లు తెరపైకి రావడం వైకాపా వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

సీబీఐ తన తదుపరి దర్యాప్తులో భాగంగా ఎవరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయబోతోంది? సునీత రెడ్డి లేవనెత్తుతున్న అనుమానాలకు బలం చేకూరేలా ఆధారాలు దొరుకుతాయా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ సీబీఐ త‌మ నెక్స్ట్ టార్గెట్స్ గా జగ‌న్ దంప‌తుల వైపు అడుగులు వేస్తే, అది కేవలం ఒక హత్య కేసు విచారణ మాత్రమే కాదు, ఏపీ రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అంశంగా మారుతుంది అన‌డంలో సందేహం లేదు.

Tags
YS Viveka Case YS Vivekananda Reddy CBI AP Politics YS Jagan YS Bharathi Reddy
Recent Comments
Leave a Comment

Related News