అధికారం ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు.. గంటల తరబడి టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీ అధినేత మెప్పు కోసం విమర్శల్లో హద్దులు దాటారు. కానీ, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? దాదాపు 40 మంది మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్న వైసీపీలో.. ఇప్పుడు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే నేతలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? ఈ నిశ్శబ్దం వెనుక వ్యూహం ఉందా లేక అసంతృప్తి సెగలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.
గడచిన ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాదాపు 40 మంది మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. 151 మంది ఎమ్మెల్యేలు, 40 మందికి పైగా ఎమ్మెల్సీలు, ఎంపీలు.. ఇలా భారీ బలగమే ఉండేది. కానీ నేడు పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా, కీలక నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబులు పడుతున్నా.. అప్పుడు పదవులు అనుభవించిన వారంతా ఎక్కడ ఉన్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్లపై దాడులు జరిగినప్పుడు కనీసం ఖండించడానికి కూడా మిగతా మాజీ మంత్రులు ముందుకు రాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీలో ఎంతో మంది దిగ్గజాలు ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో గొంతు విప్పిన ఏకైక సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు వెనకడుగు వేయకుండా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ, అది కేవలం నామమాత్రంగానే ఉందన్న టాక్ నడుస్తోంది. మిగతా వారు మాత్రం తమకెందుకులే అని సైడ్ అయిపోయారు.
అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు చేసిన అతి వాఖ్యలు, వారి అహంభావ ధోరణే ఇప్పుడు మిగతా వారిని మౌనంగా ఉండేలా చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి వారు ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు దిగడం వల్ల పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందన్నది సీనియర్ల వాదన. నాయకత్వం కూడా ఇలాంటి వారినే ప్రోత్సహించి, తమ లాంటి నిబద్ధత గల నేతలను పక్కన పెట్టారనే ఆవేదనలో సీనియర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే, వారికి భరోసా ఇవ్వాల్సిన మాజీ ప్రజాప్రతినిధులు కనిపించకుండా పోవడం వైసీపీకి పెద్ద దెబ్బే. పదవులు ఉన్నప్పుడు మాత్రమే పార్టీ, పదవి పోగానే మౌనం అనే ధోరణి పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. అగ్ర నాయకత్వం ఇప్పటికైనా ఈ మౌనాన్ని విడగొట్టి, నేతలను ఏకం చేయకపోతే.. పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.