ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి మారుపేరైన కుప్పం నియోజకవర్గం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ నవదిశ సెంటర్లో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు పాల్గొని, ఈ ప్రాజెక్టు విశేషాలను వివరించారు.

కోటి రూపాయలతో కార్పొరేట్ వసతులు..!
సుమారు కోటి రూపాయల వ్యయంతో రెండు అంతస్తుల్లో నిర్మితమైన ఈ భవనం, గ్రామీణ యువత కలలకు రెక్కలు తొడిగే ఒక గొప్ప ఆవిష్కరణగా నిలుస్తోంది. ఈ బృహత్తర ప్రాజెక్టు సాకారం కావడంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) సంస్థ కీలక పాత్ర పోషించింది. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (KADA) సహకారంతో, ఏపీటీఎస్ కార్పొరేషన్ ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందించింది. నగరాల్లోని కార్పొరేట్ కార్యాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అన్ని రకాల అత్యాధునిక సాంకేతిక పరికరాలు మరియు వసతులతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కృషి జరిగింది.

ఈ కేంద్రం ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగ యువతకు, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు మరియు స్వయం ఉపాధి పొందే ఫ్రీలాన్సర్లకు ఒక వరం లాంటిది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి (స్టార్టప్‌లు) తక్కువ ఖర్చుతో ఆఫీసు వాతావరణాన్ని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న డిజిటల్ గ్రంథాలయం ద్వారా ప్రపంచవ్యాప్త విజ్ఞానాన్ని ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

మన్నవ మోహన కృష్ణ గారి హర్షం..!
ఈ సందర్భంగా APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు మాట్లాడుతూ.. ``కుప్పం ప్రాంతంలో ఇలాంటి ఒక వినూత్న కార్యక్రమానికి APTS ద్వారా ఆర్థిక సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన యువత డిజిటల్ విద్యలో వెనుకబడకూడదన్నదే మా లక్ష్యం,`` అని పేర్కొన్నారు.

కాగా, యువత భవిష్యత్తు కోసం ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన మన్నవ మోహన కృష్ణ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
