కోనసీమలో పచ్చని కొబ్బరి చెట్లకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజుల క్రితం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన పవన్ తన టూర్ ను రద్దు చేసుకున్నారని కూడా టాక్ వచ్చింది.
అయితే, అనివార్య కారణాల వల్ల పవన్ ఆ టూర్ రద్దు చేసుకున్నారని అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్లీ పవన్ ప్రచారానికి వస్తారా? రారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. జనసేన తరఫున టాలీవుడ్ నటులు తనీష్, ఆర్ కె నాయుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన పవన్ కల్యాణ్ కాదని, దిష్టి కల్యాణ్ అని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీని ఆదరించడం లేదని, పవన్ కల్యాణ్‌ను బీజేపీ నేతలు కలిసి భిక్షాందేహీ అని అడుక్కున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ దీనస్థితికి ఇది అద్దం పడుతోందని, తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ కు భయపడి బీజేపీ నేతలు పవన్ వంటి సినీ తారలను పిలుస్తున్నారని, అయినా ఉపయోగం ఉండదని విమర్శించారు. పవన్ గతంలో తెలంగాణ భాష, నడవడిక గురించి నీచ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పవన్ ను తెలంగాణ ప్రజలు ఆదరించరని, పవన్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. పవన్ కల్యాణ్ చెబితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరని, ఆయన ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని అన్నారు.