దేశవ్యాప్తంగా లక్షల మంది జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. వీటి వలలో చిక్కుకుని యువత దారుణంగా దెబ్బ తింటున్న ఘటనలు రోజూ మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీటి తీవ్రత గురించి పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా వాటిని ప్రమోట్ చేసే వాళ్లు, వాటిని వినియోగించేవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిది ఒక సామాజిక సమస్యగా మారిపోయింది. ఈ నేేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద పోలీసుల కన్ను పడింది. ఈ అంశం గురించి ఎప్పట్నుంచో హెచ్చరిస్తూ వచ్చిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్.. ఇప్పుడు కార్యాచారణకు నడుం బిగించారు. ఆయన ప్రోద్బలంతో హర్ష సాయి సహా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. వైసీపీ అధికార ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల సహా పలువురు సెలబ్రెటీల మీద కేసులు నమోదయ్యాయి. దీంతో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు, చిన్న స్థాయి ఫిలిం సెలబ్రెటీలు ఆ వీడియోలను డెలీట్ చేయడం, సారీ చెప్పడం, బెట్టింగ్ యాప్స్ గురించి నెగెటివ్‌గా మాట్లాడ్డం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వారి మీద పోలీసులు దృష్టిపెట్టడం బాగానే ఉంది కానీ, కేవలం చిన్న స్థాయి వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తారా అనే ప్శ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసిన వాళ్లందరిదీ దాదాపుగా చిన్న స్థాయే అని.. పెద్ద పెద్ద వాళ్లు కూడా బెట్టింగ్, రమ్మీ యాప్స్‌ను ప్రమోట్ చేశారని.. వారి సంగతేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో రమ్మీ యాప్స్ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు యాడ్స్ చేశారు. మంచు లక్ష్మి సైతం ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసింది. ఇలా లిస్టు తీస్తే పెద్ద పెద్ద వాళ్ల పేర్లు కనిపిస్తున్నాయి.