గుడ్‌న్యూస్‌.. ఉగాది వేళ పేదలకు చంద్రబాబు `మెగా` గిఫ్ట్!

admin
Published by Admin — February 09, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ పేదల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా అసంపూర్తిగా ఉండి, కళ్ల ముందే కనిపిస్తున్నా అందని ద్రాక్షలా మారిన టిడ్కో ఇళ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ ఏడాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు సొంతింటి కలను కానుకగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ మెగా గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని పేదల ఇళ్ల తాళాలు అందజేయనున్నారు.

గత ఐదేళ్లుగా టిడ్కో ఇళ్ల నిర్మాణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. మౌలిక సదుపాయాలు లేక, నిధులు అందక ఆ నిర్మాణాలు వెలవెలబోయాయి. అయితే, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టగానే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ గ్యారెంటీతో హడ్కో నుండి ఏకంగా 4,451 కోట్ల రూపాయల భారీ రుణాన్ని సాధించడంలో ప్రభుత్వం సఫలమైంది. దీనికి తోడు లబ్ధిదారులు తమ వాటాగా మరో 1,500 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండటంతో, నిధుల కొరత తీరి పనులు పరుగులు పెడుతున్నాయి.

ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం.. మొత్తం మూడు విభాగాలుగా నిర్మించారు. 54,943 ఇళ్ళు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండ‌గా.. మరో 28,986 ఇళ్లు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. అలాగే 16,223 ఇళ్లు 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తంగా దాదాపు లక్ష ఇళ్లు ఇప్పటికే తుది మెరుగులకు చేరుకున్నాయి. వీటిలో ముందుగా ప్రారంభించి ఇళ్ల‌కు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ఉగాది నాటికి లబ్ధిదారులను గృహప్రవేశం చేయించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

కేవలం ఉగాది కానుకతోనే ఆగకుండా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని టిడ్కో ఇళ్లను పూర్తి చేసి, అర్హులైన ప్రతి పేదవాడికి గూడు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఏదేమైనా ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో మగ్గుతున్న పట్టణ పేదలకు ఇది నిజంగానే ఒక మెగా గిఫ్ట్ అని చెప్పవచ్చు.  

Tags
Ugadi 2026 AP TIDCO Houses Chandrababu Naidu AP Housing Andhra Pradesh TDP
Recent Comments
Leave a Comment

Related News