ఏపీ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ వేదికగా హైడ్రామా మొదలుకాబోతోంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు కేవలం ఆర్థిక లెక్కలకే పరిమితం కాకుండా, రాజకీయ అస్తిత్వ పోరాటానికి వేదికగా మారనున్నాయి. సుమారు నెల రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ సెషన్‌లో కీలక బిల్లుల కంటే కూడా, వైసీపీ ఎమ్మెల్యేలపై పడనున్న అనర్హత వేటు అంశమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంతకాలంగా సభకు గైర్హాజరవుతూ, కేవలం రిజిస్టర్‌లో సంతకాలు చేసి ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. వీరిపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ విచారణ ముమ్మరం చేసింది. సభకు రాకుండా ప్రజల గొంతుక వినిపించని వారికి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత ఉందా అన్న కోణంలో స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఆ ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఒకవేళ అనర్హత వేటు పడితే.. వచ్చే ఉప ఎన్నికల్లో నెగ్గడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని వారికి క్లారిటీ వచ్చేసింది.
ఈ పరిణాల నడుమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి అసెంబ్లీని బహిష్కరించాలా? లేక పదవిని కాపాడుకోవడానికి సభలో అడుగుపెట్టాలా? అన్నది తేల్చుకోలేక సదరు ఎమ్మెల్యేలు డైలమాలో పడిపోయారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ ఆరుగురిలో కనీసం నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవుల కోసం జగన్ ఆదేశాలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. అధినేత ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా అసెంబ్లీ గడప తొక్కాల్సిందేనని వారు భావిస్తున్నట్లు సమాచారం.
అయితే పదవి కోసం అసెంబ్లీ వైపు అడుగులు వేస్తే పార్టీ పోతుంది.. పార్టీ కోసం ఆగితే పదవి పోతుంది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఉంది. దీనికి తోడు వైసీపీ నుంచి బయటకు వస్తే చేర్చుకోవడానికి అటు టీడీపీ గానీ, ఇటు జనసేన గానీ సిద్ధంగా లేవు. ఫిరాయింపులను ప్రోత్సహించే ఉద్దేశం లేదని కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో అటు సొంత పార్టీలో ఉండలేక, ఇటు కూటమిలో చేరలేక ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు. మరి ఈ బడ్జెట్ సమావేశాల సాక్షిగా ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? చూడాలి.