ఏపీలో పేదలకు పండగ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా లక్ష మందికి పక్కా గృహాలను అందజేసేం దుకు రెడీ అయింది. మొత్తంగా 1.04 లక్షల కుటుంబాలకు టిడ్కో గృహాలను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వీటిలో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగుల గృహాలు ఉన్నా యి. వీటిని వచ్చే ఉగాది నాటికి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయా ఇళ్లకు తుదిమెరుగులు దిద్దే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు.
వైసీపీ హయాంలో..
వాస్తవానికి ప్రస్తుతం లబ్ధి పొందుతున్న పేదలంతా గత టీడీపీ హయాంలోనే పక్కా నివాసాలకు ఎంపిక య్యారు. వారి వాటా కింద ఒక్కొక్కరు రూ.25000 చొప్పున కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ఇంతలోనే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో టీడీపీ హయాంలో చేసిన పనులను నిలిపి వేశారు. ఈ క్రమంలోనే జగనన్న ఇళ్ల పేరుతో సొంత స్థలాలను ఇచ్చి.. కట్టించే ప్రయత్నం చేశారు. కానీ, ఇవి ఊరికి శివారులో ఉండడంతో 50 శాతం మంది లబ్ధిదారులు వీటిని తీసుకునేందుకు ముందుకు రాలేదు.
ఇక, మిగిలిన 50 శాతంలోనూ 10 శాతం మాత్రమే ఇళ్లు పూర్తయ్యాయి. మరోవైపు.. టిడ్కో ఇళ్లకోసం బ్యాంకు ల నుంచి రుణాలు తెచ్చుకునే ప్రక్రియను కూడా వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ ఇళ్లు మూలన పడ్డాయి. దీంతో కూటమి సర్కారు వచ్చిన వెంటనే ప్రజలు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మరోసారి పక్కా నివాసాలపై కదలిక వచ్చింది. ఇప్పటికే 3.2 లక్షల గృహాలను ప్రభుత్వం అందించింది.
ఇక.. ఇప్పుడు మరో లక్ష ఇళ్లను కూడా పేదలకు అందించాలని నిర్ణయించింది. ఉగాది నాటికి ఆయా ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసుకునేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. బ్యాంకులను ఒప్పించి 4 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకుంది. దీనికితోడు.. మరో వెయ్యి నుంచి 1500 కోట్ల రూపాయలను లబ్ధి దారుల నుంచి తీసుకున్నారు. దీంతో పేదలకు సొంతింటి కల నిజం కానుంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఉగాది నాటికి పేదలకు పక్కా ఆవాసాలు రావడం ఖాయమని అంటున్నారు అధికారులు.