సోషల్ మీడియా జనాలు యాటిట్యూడ్ స్టార్ అని పిలుచుకునే చంద్రహాస్ కొత్త సినిమా బరాబర్ ప్రేమిస్తే శుక్రవారమే రిలీజైంది. కానీ ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఐతే ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన పాటలో దొర్లిన బూతుల మీద పెద్ద చర్చే జరిగింది. చంద్రహాస్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఆ పాట విషయంలో పొరపాటైందని ఒప్పుకోకపోగా.. అతను ఎదురు దాడి చేశాడు. ఈ పాటను తప్పుబట్టిన జర్నలిస్టు మీద కేసు పెడతానన్నాడు. టీవీ చర్చల్లో, ఇంటర్వ్యూల్లో కూడా అతను ఆ పాటను సమర్థించుకుంటూనే మాట్లాడుతున్నాడు. కాగా బరాబర్ ప్రేమిస్తా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి.. ఈ పాట విషయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తనకు ఆ పాట నచ్చలేదని, ఆ ఈవెంట్ నుంచి మధ్యలోనే బయటికి వచ్చేయాల్సిందని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రహాస్.. జేడీ వీడియో మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జేడీ మాటలతో తాను బాగా హర్టయినట్లు వెల్లడించాడు. జేడీని తన సినిమాకు చీఫ్ గెస్ట్‌గా పిలిచి తప్పుచేశానని.. అందుకు బాధ పడుతున్నానని పేర్కొన్నాడు. జేడీ మీద ఎంతో అభిమానంతో తమ ఈవెంట్‌కు పిలిస్తే ఇలా చేస్తాడనుకోలేదన్నాడు.
ఆయనకు పాట నచ్చకపోతే అప్పుడే ఆ విషయం చెప్పి ఉండొచ్చని.. స్టేజ్ మీదికి వచ్చి తనను చెంపదెబ్బ కొట్టినా తాను తీసుకునేవాడినని చంద్రహాస్ వ్యాఖ్యానించాడు. ఈవెంట్‌ను గమనిస్తే పాట అవ్వగానే జేడీ చేతులెత్తి చప్పట్లు కొట్టిన విజువల్ కనిపిస్తుందని... ఆయన ఆ పాటను ఎంజాయ్ చేశాడని చంద్రహాస్ తెలిపాడు. అంతే కాక ఈవెంట్ అయిన రోజు రాత్రి తనను అభినందిస్తూ, తన తండ్రికి జేడీ మెసేజ్ కూడా చేశాడని.. ఈ పాట వైరల్ అయి, మంచి పబ్లిసిటీ వస్తుందని జేడీ ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడని చంద్రహాస్ తెలిపాడు. అలా మెసేజ్ చేసిన వ్యక్తి మరుసటి రోజు ఇలా మాట మార్చడం తనను ఎంతగానో బాధించిందని, అందుకే ఆయన్ని ఈవెంట్‌కు పిలవాల్సింది కాదనిపించిందని చంద్రహాస్ చెప్పాడు.