తెలంగాణలో పొలిటికల్ గేమ్ ఇప్పుడే మొదలైందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచల న వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లా డారు. ``ఎన్నికలకు ముందు మీరు గేమ్ స్టార్ట్ చేశారు. మేం ఇప్పుడు ముగింపు పలికాం. కరీంనగర్ నుంచే మా గేమ్ స్టార్టయింది. కప్పు గెలిచి మేం ముగింపు పలికాం. మీ కుట్రలు, కుతంత్రాలకు ఎవరూ భయ పడే ది లేదు.`` అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీజేపీ యుద్ధం మొదలైందన్న బండి.. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ మెడలు వంచుతామని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరాల్సిందేనన్నారు. తెలంగాణలో బీజేపీ చేసే యు ద్ధాన్ని తట్టుకునే దమ్ముంటే మీరు తట్టుకోవాలంటూ.. కాంగ్రెస్ నేతలకు సవాల్ రువ్వారు. కరీంనగర్‌లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మూడు పార్టీలు కలిసి(కాంగ్రెస్-బీఆర్ ఎస్-ఎంఐఎం) తమను అడ్డుకున్నాయని.. ఈ మూడు పార్టీలు ఒక్కటేనన్న విషయం అర్థమైందని తెలిపారు.
ఇప్పుడు కొత్త ఆట మొదలైందని.. తాము పక్కాగా ముగింపు ఇస్తామని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్, ఎంఐఎం చేసిన కుట్రలు చూసి తాము నవ్వుకున్నట్టు తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం తీరును ఆ పార్టీ కార్పొరేటర్లే తిరస్కరించారని.. బీజేపీకి వారు మద్దతు పలికారని, వారిని అభినందిస్తున్నా మని బండి వ్యాఖ్యానించారు. బీజేపీకి 30 సీట్లు వచ్చాయని, కుట్రలు చేయకూడదని భావించి.. బీఆర్ ఎస్ కార్పొరేటర్లే.. ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని బండి చెప్పారు.
కాగా.. కరీంనగర్ కార్పొరేషన్‌లో తొలిసారి బీజేపీ విజయం దక్కించుకుంది. 30 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్న బండి సంజయ్ ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించారు. అయితే.. మేజిక్ ఫిగర్ కు నలుగురు సభ్యులు తగ్గడంతో ఆది నుంచి ఉత్కంఠ ఏర్పడినా.. చివరి నిముషంలో స్వతంత్ర అభ్యర్థుల మద్దతును కూడగట్టి మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుని.. కరీంనగర్‌లో బండి తన సత్తాను చాటుకున్నారు.