గుంటూరు: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా ఒక అధికార పక్ష ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఇంటినే టార్గెట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ సీనియర్ నాయకులు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
గుంటూరు జిల్లా చింతలపూడిలో ప్రమీలాదేవి నివాసం ఉంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె తన కుమారుడు నరేంద్ర ఇంట్లోనే ఉంటుండటంతో, చింతలపూడిలోని ఇల్లు ఖాళీగా ఉంది. దీన్ని అదనుగా భావించిన దుండగులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించి, ఎవరూ లేని సమయంలో లోపలికి చొరబడ్డారు. బీరువాలను పగులగొట్టి నిలువు దోపిడీ చేసేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, రూ. 1 లక్ష నగదు దుండగులు అపహరించుకుపోయారు. ఎమ్మెల్యే తల్లి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉండటంతో లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఘటన తెలిసిన వెంటనే చింతలపూడి పోలీసులు క్లూస్ టీమ్‌తో వచ్చి ఇంట్లోని వేలిముద్రలను సేకరించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. ఈ దొంగతనం వెనుక ప్రొఫెషనల్ గ్యాంగ్ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఒక ఎమ్మెల్యే తల్లి ఇంట్లోనే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రజాప్రతినిధుల కుటుంబాలకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఈ ఘటనతో బలంగా వినిపిస్తున్నాయి.