టాలీవుడ్ యువ నటి ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు న్యాయం గెలిచింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. తన కూతురు మరణం వెనుక ఉన్న నిజాన్ని నిరూపించేందుకు ఒక తల్లి చేసిన అలుపెరగని పోరాటం వృథా కాలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్షను ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
ఆ రోజు ఏం జరిగింది?
2002 ఫిబ్రవరి 23.. టాలీవుడ్‌లో ఎదుగుతున్న తారగా ఉన్న ప్రత్యూష మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. తానూ, ప్రత్యూష ప్రేమికులం అని.. పెద్దలు అంగీకరించలేదనే బాధతో ఇద్దరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని సిద్ధార్థ రెడ్డి అప్పట్లో కోర్టుకు తెలిపాడు. సిద్ధార్థ రెడ్డి బతికి బయటపడగా, ప్రత్యూష మాత్రం ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ప్రత్యూష తల్లి సరోజిని మొదటి నుండి ఆరోపిస్తూనే ఉన్నారు.
ఈ కేసును విచారించిన సిబిఐ, ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ రెడ్డే ప్రేరేపించాడని నిర్ధారించింది. తొలుత హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అతనికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించగా, సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ శిక్షను 2 ఏళ్లకు కుదించారు. అయితే, ఆ శిక్షను కూడా రద్దు చేయాలని సిద్ధార్థ రెడ్డి, అసలు శిక్ష పెంచాలని ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుమారు 24 ఏళ్ల పాటు సాగిన ఈ వాదనల అనంతరం, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం సిద్ధార్థ రెడ్డి అభ్యర్థనను తోసిపుచ్చింది.
హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి తక్షణమే లొంగిపోవాలని, వచ్చే నాలుగు వారాల్లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రత్యూష తల్లికి ఊరట లభించినట్లయింది. న్యాయం ఆలస్యమవ్వొచ్చు కానీ, కచ్చితంగా జరుగుతుందని ఈ తీర్పు నిరూపించింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.